18-07-2025 10:08:04 PM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, కోటీశ్వరులను చేయడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ దేశంలోనే మహిళాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తల మానికంగా నిలుస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో మహిళా శక్తి సంబరాల్లో భాగంగా బ్యాంకు లింకేజ్ రుణాలు, లోన్ బీమా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపుల నిర్వహణ బాధ్యత అప్పగించి వారికి తోడ్పాటునందిస్తుందన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 4 మండల సమాఖ్యలు, 204 గ్రామా సంఘాలు, 5243 స్వయం సహాయక బృందాలకు 55,278 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్యాంకు లింకేజి ద్వారా 3,033 గ్రూపులకు 241.58 కోట్ల రూపాయల ఋణాలు మంజూరి, 10,652 గ్రూపులకు రూ.11.58 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరి చేయడమైనదన్నారు. 2,410 ఎంటర్ ప్రైజెస్ లు ఏర్పాటు చేయడమైనదని, 4 ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ లు, 1 మిల్క్ పార్లరు, మొబైల్ ఫిష్ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడమైనదన్నారు.
ఆర్.టి.సి బస్సు ద్వారా నెలకు రూ.69,468 అద్దె సంబంధిత మండల సమాఖ్యకు లభిస్తున్నదన్నారు. 35,206 స్కూల్ యూనిఫాంలు 241 మంది మహిళా టైలర్లతో కుట్టించడం జరిగిందని, లోన్ బీమా క్రింద 31 క్లెయిమ్ లకు గాను రూ.27.43 లక్షల చెల్లించడం జరిగిందన్నారు. సంఘ సభ్యురాలు ఏదైనా కారణంచే చనిపోయిన ఆమె అప్పు గరిష్టంగా 2.00 లక్షల వరకు మాఫీ చేయబడునని ప్రమాద భీమా క్రింద 4 క్లెయిమ్ కు గాను రూ.40.00 లక్షలు మంజూరి చేసినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాటశాల కమిటి చైర్మన్ గా మహిళా సంఘ సభ్యులను నియమించి 34 స్కూల్లలో 2.98 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణ, నిర్వహణ పనులను అప్పగించడం జరిగిందన్నారు. 14 మార్కెటింగ్ సెంటర్ల ద్వారా రభీ- 2025 సీజన్లో 1.54 లక్షల క్వింటాళ్ళ వడ్లు కొనుగోలు చేయడం ద్వారా రూ.50.84 లక్షల కమిషన్ పొందడం జరిగిందన్నారు.