మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) డిమాండ్
గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని గుండాల, కాచనపల్లి, చెట్టుపల్లి గ్రామాల్లో ప్రాథమిక సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు, గుండాల సర్పంచ్ కొమరం సీతా రాములు, పూనెం రంగయ్య లు మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా దరిదాపు 40 శాతం మంది రైతులు యాసంగి మొక్కజొన్నలు పండించారని, ప్రభుత్వం మద్దతు ధర 2400 ఉండగా బయట వ్యాపారస్తులు 1700 కి కొనుగోలు చేస్తున్నారని, ఎంతో కష్టపడి పంట పండిస్తే రైతులకు కనీసం పెట్టుబడి కూడా రావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేపర్ ప్రకటనలు తప్ప ఏర్పాటు చేసిన దాఖలు లేవని, వెంటనే ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ద్వారా కొనుగోలు కేంద్రాలన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ-అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు గడ్డం లాలయ్య, యాసారపు వెంకన్న, అరెం నరేష్, పర్శక రవి, పాయం ఎల్లన్న, పెండకట్ల పెంటన్న, ఈసం మంగన్న, మానాల ఉపేందర్, పునెం నరసన్న, బానోత్ లాలు, భూక్యా వెంకన్న, తాటి రమేష్, కల్తి ప్రమోద్, మోకాళ్ళ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






