17 April, 2026 | 3:33 AM

మక్కల కొనుగోల్.. మాల్..

17-04-2026 01:51 AM
  1. తరుగు పేరిట దోపిడి..

రూ. 5 నుంచి రూ. 6 లక్షలు పక్కదారి..

బోరుమంటున్న రైతులు..

పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి, ఏప్రిల్, 1౬ ( విజయ క్రాంతి ): ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించుకుంటే మద్దతు ధర లభిస్తుందని,డబ్బులు ఎక్కువగా వస్తాయని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.ప్రైవేట్ దళారులకు తమ ధాన్యాన్ని విక్రయిస్తే తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు, తరుగు పేరిట మోసం చేస్తారు అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో తాము పండించిన ధాన్యాన్ని విక్రయిస్తే ఇక్కడ పెద్ద మోసమే జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరుతో మోసం చేశారని వాపోతున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి... కామారెడ్డి జిల్లా తాడువాయి సింగిల్ విండో పరిధిలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో మొత్తం 36వేల 806 బస్తాలను  కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు 50 కిలోల చొప్పున 18403 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు.ఇది బాగానే ఉంది. కానీ అసలు మోసం వేరేలా ఉంది. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యం దళారుల వద్దకు వెళ్ళవద్దని దళారులతో రైతులు మోసపోవద్దని ప్రత్యేకంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దీన్ని అణువుగా చేసుకొని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. అధికారులు తూకం విషయంలో చాలా తేడాలు చేస్తున్నారు.ఒక్కో బస్తా ను తూకం వేసిన సమయంలో ఖాళీ బస్తా బరువు 600 గ్రాములు మాత్రమే ఉంటుంది. కానీ ఒక కిలో బరువు ఎక్కువగా తూకం చేశారు.అది కాకుండా ఒక్కో బస్తా తూకం వేసినప్పుడు మరో 300 గ్రాములు అదనంగా తూకం చేసి తీసుకున్నారు.

అంటే ఒక బస్తాను తూకం చేసినప్పుడు 51.300 కిలోలు తూకం వేసి తీసుకున్నారు. రైతుల నుంచి ఒక్కో బస్తా కు  700 గ్రాముల ధాన్యాన్ని అదనంగా తీసుకున్నారు.ఇదే కాకుండా మీ ధాన్యం తరుగు వచ్చిందని,ఒక్కో రైతు వద్ద అర క్వింటాలు నుంచి రెండున్నర క్వింటాళ్ల  ధాన్యాన్ని తరుగు పేరుతో తగ్గించారు. ఇదంతా పక్కాగా అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై  తరుగు పేరిట దోపిడీ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో కొందరి నాయకుల చేతివాటం సైతం ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కొందరు రైతుల ధాన్యం నుంచి 50 కిలోల నుంచి రెండున్నర క్వింటాళ్ల దాన్యం వరకు తరుగు చేసి రైతుల ఖాతాలో తక్కువ డబ్బులు జమ చేశారు. రెండవసారి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మొత్తం రూ. 5 నుంచి రూ.6 లక్షలు పక్కదారి పట్టినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

ఇంత ఘోరంగా రైతుల నుంచి దోపిడీ చేస్తారా అని మండిపడుతున్నారు.ఈ విషయమై  రైతులు తమకు తక్కువ డబ్బులు రావటం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తే మాకు తెలియదని వారు దాటవేస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఒక్కో క్వింటాకు రూ.70 వసూలు 

రైతులు ధాన్యం తూకం వేసినప్పుడు రైతుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయవద్దు.కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో క్వింటాలకు రైతుల నుంచి రూ.70 వసూలు చేశారు. ఎందుకు వసూలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తే ఖర్చులు ఉంటాయని సమాధానం చెప్పారన్నారు. రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులు సిబ్బంది వద్ద ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకిటి వెంకట్ రాంరెడ్డి తెలిపారు.

ఈ విషయమై ఆయన తాడ్వాయి లో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి మరీ పత్రాలు చూపించారు.ఇందులో పక్కాగా సింగిల్ విండో సిబ్బంది రూ.1.83 లక్షలు పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తాను పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని బహిరంగాంగానే చెబుతున్నారు. కొందరు సిబ్బంది కావాలనే తరుగు పేరుతో చేతివాటం ప్రదర్శించారన్నారు. అదే కాకుండా రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులను సిబ్బంది పంచుకున్నట్లు ఆరోపించారు.

ఎవరెవరు ఎన్నెన్ని డబ్బులు పంచుకున్నారో తన వద్ద జాబితా ఉందన్నారు. ప్రభుత్వం రైతుల కోసం రెండోసారి మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే సిబ్బంది ఇలా వ్యవహరిస్తారా అని ఆయన మండిపడ్డారు. తాడ్వాయిలో మొదటిసారి మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఎంతోమంది రైతులకు మేలు చేశామని తెలిపారు.

రెండవసారి మక్కల కొనుగోలు కేంద్రం కోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యేతో మాట్లాడి అనుమతులు తీసుకువచ్చినట్లు వివరించారు.ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రం ఏర్పాటు చేయించారని వివరించారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి తరుగు పేరుతో రైతులకు మినాయించిన డబ్బులను వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. లేని యెడల సింగిల్ విండో వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తరుగు పేరుతో 2 క్వింటాళ్ళ డబ్బులు కట్ చేశారు 

నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కలు కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయిస్తే తరుగు పేరుతో అధికారులు నావి క్వింటాలు,మా అమ్మ శారదవి క్వింటాలు మొత్తం రెండు క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ.4800 కట్ చేశారు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి అధికారులు ఇలా తరుగు పేరుతో డబ్బులు కట్ చేస్తే ఎలా వెంటనే మా డబ్బులు మాకు ఇప్పించాలి.

- మూగ రాజు, రైతు, చిట్యాల 

తరుగు పేరుతో ఒక క్వింటాలు ధాన్యం డబ్బులు కట్ చేశారు  

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో తాను మక్కలు విక్రయిస్తే ఒక క్వింటాలు ధాన్యాన్ని తరుగు పేరుతో కట్ చేశారు. నాకు రూ. 2400 కట్ చేసి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు.దళారులకు మక్కలు విక్రయిస్తే మోసపోతామని,ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయిస్తే ఇక్కడ మోసపోయాం. అధికారుల స్పందించి మా డబ్బులు మాకు ఇప్పించాలి.

- సప్పటి రాజిరెడ్డి, రైతు, చిట్యాల