03-11-2025 02:30:13 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 2 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే, నియోజకవర్గంలోని మురికివాడలు, బస్తీల రూపురేఖలు సమూలంగా మారుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే బస్తీలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుస్థితిని పూర్తిగా మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. యూసుఫ్‌గూడలోని శ్రీ సాయి రాం గార్డెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులు, స్థానిక ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి. జూబ్లీహిల్స్‌కు మహర్దశ తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిలారీ మనోహర్, బండి రమేష్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.