03-11-2025 02:33:18 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 2 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం నియోజకవర్గానికే పరిమితం కాదని, ఇది తెలంగాణలోని యావత్ బీసీల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ఒక పరీక్ష అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీల నినాదం బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో, అధిష్ఠానం బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చిందని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకుని బీసీల తడాఖా ఏంటో చూపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ సమయం ఇదేనని ఆయ న పిలుపునిచ్చారు.
మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన మున్నూ రు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఇచ్చిన ‘ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో, వారికి అంత వాటా’ అనే నినాదం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారింది. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం మేము చేస్తున్న పోరాటానికి ఆ నినాదమే ఊతమిచ్చింది, అని అన్నారు.
బీసీ బిడ్డలను రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతోందని, బీఆర్‌ఎస్, బీజేపీ ఆ సాహసం చేయగలవా? అని ఆయన సవాల్ విసిరారు. బీసీలు ఎప్పటికీ ఏకం కారనే ధీమాతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఉన్నాయి. ఆ భ్రమలను తొలగించాల్సిన సమయం ఇదే. ‘కులాభిమానం ఉండొచ్చు, కానీ కులపిచ్చి ఉండకూడదు. బీసీలందరూ ఐక్యంగా ఉంటేనే మనకు బలం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో మనం బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకోలేకపోతే, రేపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కును మనమే కోల్పోతాం. కాబట్టి ఈ గెలుపు మనందరికీ అత్యంత ప్రతిష్టాత్మకం అని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు.
సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేతలు
ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్యామ్ మోహన్, ఈరవత్రి అనిల్, మాజీ మంత్రి ఆకుల లలిత, కేకే మహేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సత్తు మల్లేష్, తూము వినయ్ కుమార్, మిర్యాల రాఘవ రావు తదితర ముఖ్య నేతలు హాజరై, నవీన్ యాదవ్ గెలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.