06-07-2025 01:19:03 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచాల, నోము ల, లింగంపల్లి గ్రామాల్లో 96 మంది గూడు లేని నిరుపేదలకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు వీడియో గ్రాఫ్ సమక్షంలో లాటరీ విధానం ద్వారా డబుల్ బెడ్ రూమం ఇళ్లను కేటాయించారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు.
వాటి కేటాయింపులో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. పాత కేటాయింపులను రద్దు చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, అనుచరులకు కేటాయించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసి శనివారం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నోములలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల స్థలానికి వెళ్లారు. గతంలో కేటాయించిన లబ్ధిదారులకు పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక సంబంధిత అధికారులను సంప్రదించి, లబ్ధిదారుల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూ చించారు. మంచినీటి, ఎలక్ట్రిక్ సౌకర్యాలు అందజేయాలని అధికారులకు సూచించారు. మంచిరెడ్డి చొరవతో న్యాయం జరుగుతుందని పేదలు ఆశాభావం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ హయాంలో పేదలకు అనేక పథకాలు అందాయని వాటిలో భాగమే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లని వారు స్పష్టం చేశారు.