06-07-2025 01:20:37 AM
ఇప్పటి వరకు 36 మృతదేహాల అప్పగింత
ఇంకా ప్రశ్నార్థకంగానే 9 మంది ఆచూకీ
సంగారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మున్మున్ చౌదరి అనే కార్మికుడు శనివారం మృతి చెందాడు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 40కి చేరింది. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించి శనివారం వారి బంధువులకు అప్పగించారు. గుర్తించిన మృతదేహాల్లో ఇద్దరు బీహార్, ఒకరు ఒడిశాకు చెందినవారని అధికారులు తెలిపారు.
కాగా ఇప్పటి వరకు మొత్తం 36 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించారు. సిగాచి పరిశ్రమలో ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు భవన శిథిలాలను తొలగిస్తున్నాయి. ఇంకా ఐదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
వివిధ ఆసుపత్రుల్లో మరో 23 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఓవైపు పోలీసులు శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయిందని చెపుతున్నా మరోవైపు రెవెన్యూ అధికారులు మాత్రం తొలగింపు చర్యలు నడుస్తున్నట్లు చెపుతున్నారు. కాగా బీహార్‌కు చెందిన నేతలు కొందరు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబీకులతో మాట్లాడారు.