03-05-2024 12:44:08 AM
లైంగిక వేధింపుల ఆరోపణపై సిట్ చర్యలు
గడువు అప్పీల్‌ను తిరస్కరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం
ప్రజ్వల్ వ్యవహారంలో చల్లారని రాజకీయ దుమారం
వీడియోలు లీక్ చేసిన డ్రైవర్ మిస్సింగ్
బెంగళూరు, మే 2: జేడీఎస్ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం ఇంకా చల్లారట్లేదు. సిట్ ఆయనకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర గురువారం మాట్లాడుతూ.. ప్రజ్వల్ రేవణ్ణ సిట్ ముందు హాజరుకావాలని, లేనిపక్షంలో అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై దర్యాప్తు చేపట్టిన సిట్.. విచారణకు హాజరుకావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే తనకు 7 రోజుల సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. ఇందుకు తిరస్కరించిన సిట్ ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ప్రజ్వల్ రేవణ్ణ తరఫు న్యాయవాది అరుణ్ జీ పలు అంశాలను సిట్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో వివిధ కోణాలు ఉన్నాయని, పరిష్కరించేందుకు సమయం కావాలని అడిగారు. వీడియోలు మార్ఫింగ్ చేసినవని ప్రజ్వల్ చెప్పినట్లు న్యాయవాది తెలిపారు. కాగా తాను విచారణకు హాజరుకావడానికి బెంగళూరులో లేనందున సిట్ అధికారులకు న్యాయవాది ద్వారా సమాచారం ఇస్తున్నానని ప్రజ్వల్ రేవణ్ణ టిట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలు ఎన్నికల వేళ పెద్ద రాజకీయ దుమారం రేపాయి. ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ దానిని అవకాశంగా మార్చుకుంది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. తమ కూటమి అభ్యర్థిపై ఆరోపణలు వస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు 10 రోజుల ముందు ప్రధాని స్వయంగా ఆయన తరఫున ప్రచారానికి వెళ్లారని గుర్తుచేశారు. అదే వ్యక్తి ఇప్పుడు దేశం నుంచి పారిపోయాడని, అలాంటి వారికి బీజేపీ మద్దతు పలుకుతోందని విమర్శించారు. ప్రియాంక వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా ఎదురుదాడికి దిగారు. జేడీఎస్‌తో మాకు పొత్తు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దౌర్జన్యాలకు పాల్పడే వారికి మద్దతు ఇవ్వమని చెప్పారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే అతను దేశం విడిచిపోయాడంటూ కౌంటర్ ఇచ్చారు.
డ్రైవర్ అదృశ్యం..
ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలతో ఉన్న పెన్‌డ్రైవ్‌ను బీజేపీ నాయకు డు దేవరాజే గౌడకు ఇచ్చినట్లు అంగీకరించిన ఆయన మాజీ డ్రైవర్ కార్తీక్ సిట్ నోటీసుల అనంతరం అదృశ్యమయ్యాడు. ప్రజ్వల్ రేవణ్ణ దగ్గర కార్తీక్ 13 ఏళ్లు డ్రైవర్‌గా పనిచేశాడు. ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో గతేడాది ప్రజ్వల్‌తో గొడవపడ్డాడు. కాగా డ్రైవర్ అదృశ్యంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. డ్రైవర్ అదృశ్యం వెనుక ముఖ్యమైన నాయకులు ఉన్నారని ఆరోపించారు.