calender_icon.png 13 May, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పాక్ డ్రోన్లు!

13-05-2025 01:20:44 AM

  1. అమృత్‌సర్, సాంబా సెక్టార్, హోషియాపూర్ జిల్లాలో బ్లాకౌట్ 
  2. జలంధర్‌లో కూలిన నిఘా డ్రోన్
  3. వెనక్కు మళ్లిన ఇండిగో విమానం

న్యూఢిల్లీ, మే 12: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ మళ్లీ డ్రోన్ దాడులకు దిగింది. సోమవారం డీజీఎంవోల చర్చల తర్వాత కూడా పాక్ బుద్ధి మార లేదు. కుక్క తోక వంకర అన్న చందంగా సోమవారం రాత్రి అమృత్‌సర్, సాంబా సెక్టార్‌లపైకి డ్రోన్లు పంపింది. పాక్ డ్రోన్లతో అమృత్‌సర్‌లో  సైరన్లు మోగాయి.

అమృత్‌సర్‌తో పాటు హోషియాపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అధికారులు బ్లాకౌట్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్లల్లో లైట్లు ఆర్పేయాలని, కిటీకీల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.

ఈ మేరకు అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని ఒక ప్రకటన విడుదల చేశారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో కూడా డ్రోన్లు కనిపించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. అక్కడ కూడా బ్లాకౌట్ విధించినట్టు తెలుస్తోంది. హోషియాపూర్ జిల్లాలోని దసుయ, ముకేరియన్ ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు. 

కూలిన నిఘా డ్రోన్

పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ నిఘా డ్రోన్ కనిపించగా.. దానిని ఆర్మీ కూల్చేసిందని జలంధర్ డిప్యూటీ కమిషనర్ హిమాంశు అగర్వాల్ పేర్కొన్నారు. ‘మాండ్ గ్రామ సమీపంలో ఓ నిఘా డ్రోన్‌ను సైనిక దళాలు కూల్చేశాయని నాకు సమాచారం అందింది. నిపుణుల బృందం శిథిలాల కోసం గాలిస్తోంది.

ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి.. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. 10 గంటల నుంచి జలంధర్‌లో ఎటువంటి డ్రోన్లు కనిపించట్లేదు.’ అని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ఈ బ్లాకౌట్‌ల నేపథ్యంలో వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.