calender_icon.png 13 May, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదం, పీవోకే పైనే!

13-05-2025 01:17:09 AM

భారతీయులందరికీ సెల్యూట్

పాక్‌తో చర్చలు అంటే ఇక..

  1. శక్తిని ఉపయోగించయినా శాంతిని సాధిస్తాం 
  2. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు 
  3. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బకొట్టాం 
  4. ఉగ్రసంస్థల చేతిలో ఏదో ఒకరోజు పాక్ కథ ఫినిష్ 
  5.  ఆపరేషన్ సిందూర్‌కు ఇది విరామం మాత్రమే 
  6. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

* ఆపరేషన్ సిందూర్‌తో కచ్చితత్వం, అసమాన శౌర్యాన్ని ప్రదర్శిస్త్తూ మన సైనిక బలగాలు లక్ష్యాలను చేధించాయి. మన సైనికుల వీరత్వం, పరాక్రమం, సాహసానికి సెల్యూట్ చేస్తున్నా. మనదేశంలోని ప్రతి తల్లీ, ప్రతి సోదరీ, ప్రతి కుమార్తెకు ఈ పరాక్రమం అంకితం. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేసాయి. 

* ఉగ్రవాదం చర్చలు ఏకకాలంలో జరిగేవి కావు. ఉగ్రవాదం, వాణిజ్యం ఏకకాలంలో జరగవు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.

బహవల్‌పూర్, మురుద్కే వంటి ఉగ్రవాద స్థావరా లపై భారత వాయుసేన దాడి చేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది. టెర్రరిజానికి గ్లోబల్ యూనివర్సిటీగా మారిన పాకిస్థాన్ ఇకనైనా శాంతిమార్గాన పయనించకపోతే ఆ దేశం మనుగడ సాధించడం కష్టం.

  ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, మే 12 : ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిన తర్వాత మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్థాన్ వైఖరిపై గర్జించారు. ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ సైనిక దళాల దెబ్బకు పాకిస్థాన్ నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు. ఇక చేసేదిలేక కాల్పు ల విరమణకు శరణంటూ వచ్చిందని పేర్కొన్నారు. నాలుగు రోజులుగా భారత సైన్యం సాహసాన్ని, అసమాన వీరత్వాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించిందని చెప్పారు.

పాకిస్థాన్‌పై తిరుగులేని విజయానికి కారణమైన ప్రతి సైనికుడికి, శాస్త్రవేత్తకు, భారతీయులందరికీ సెల్యూట్ అని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో దేశంలోని రాజకీయ పార్టీలు, పౌరులందరూ ఒక తాటిపైకి వచ్చారని, వారందరికీ ప్రధాని ధన్యవాదాలు చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’తో ౭వ తేదీ రాత్రి భారత్ తన సామర్థ్యమేమిటో పాకిస్థాన్‌కు చవిచూపించిందని మోదీ అన్నారు.

మన ‘మేడిన్ ఇండియా’యుద్ధ పరికరాల సామర్థ్యమేమిటో ప్రపంచానికి తెలియవచ్చిందని ప్రధాని చెప్పారు. పాకిస్థాన్‌తో ఇక చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పైనే అని ప్రధాని తేల్చి చెప్పారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తే భారత్ సహించే ప్రసక్తి లేదని తెలిపారు.

ఉగ్రవాదాన్ని తుదముట్టించకపోతే ఉగ్ర సంస్థల చేతిలో ఏదో ఒకరోజు పాకిస్థాన్ కథ పరిసమాప్తం అవుతుందని ప్రధాని చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ దాడిని మొదలు పెట్టిందని, ఇప్పుడు విరామం మాత్రమేనని మోదీ తెలిపారు. ‘కొన్ని రోజులుగా మనందరం దేశ సైన్యం సామర్థ్ధ్యం, సహనాన్ని రెండింటిని చూశాం.

భారతదేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరపున సెల్యూట్ చేస్తున్నాం. మన వీర సైనికులు ‘ఆపరేషన్ సిందూర్’తో కచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తు లక్ష్యాలను చేధించారు. వారి వీరత్వం, పరాక్రమం, సాహసానికి సెల్యూట్ చేస్తున్నా. మనదేశంలోని ప్రతి తల్లీ, ప్రతి సోదరీ, ప్రతి కుమార్తెకు ఈ పరాక్రమం అంకితం’ అని ప్రధాని చెప్పారు.

పహల్గాంలో ఉగ్రవాదులు మతం అడిగి మరి కాల్పులు జరిపారన్నారు. కుటుంబసభ్యుల ముందు, పిల్లల ఎదుటే ఉగ్రవాదులు దారుణంగా కాల్పులు జరిపారని చెప్పారు. పహల్గాం ఘటనతో దేశం నివ్వెరపోయిందన్నారు. వ్యక్తిగతంగ ఎంతో కలత చెందానని ప్రధాని అన్నారు. మా తల్లుల, సోదరీమణుల సిందూరం తుడిచేసినవారికి ‘ఆపరేషన్ సిందూర్’ సరైన బుద్ధి చెప్పిందని, వారి శిబిరాలను భూమిపై నుంచి తుడిచివేశామని ప్రధాని చెప్పారు.

‘ఆపరేషన్ సిందూర్’ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, అది కోటానుకోట్ల భారతీయుల భావన అని ఆయన చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతి భారతీయుడు రగిలిపోయాడని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ పాకిస్థాన్‌ను కలలో కూడా ఊహించని విధంగా దారుణంగా దెబ్బకొట్టిందని ప్రధాని అన్నారు. ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేసాయని తెలిపారు.

యుద్ధ క్షేత్రంలో పాకిస్థాన్‌ను భారత్ ప్రతిసారి మట్టికరిపించిందని, ఈసారి కూడా అదే జరిగిందన్నారు. బహవల్‌పూర్, మురుద్కే వంటి ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడి చేసి భీతావహ పరిస్థితిని సృష్టించిందని అన్నారు. టెర్రరిజానికి గ్లోబల్ యూనివర్సిటీగా మారిన పాకిస్థాన్ ఇకనైనా శాంతిమార్గాన ప్రయణించకపోతే ఆ దేశం మనుగడ సాధించడం కష్టమన్నారు.

‘ఉగ్రవాదం చర్చలు ఏకకాలంలో జరిగేవి కావు. ఉగ్రవాదం, వాణిజ్యం ఏకకాలంలో జరగవు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు’ అని ప్రధాని మోదీ,  సంధూ జలాల ఒప్పందం తర్వాత పాకిస్థాన్ నాయకుల ప్రేలాపనలను ఉటంకించారు. బుద్ధ భగవానుడు భారత్‌కు శాంతిమార్గాన్ని ప్రభోదించారని ఆ శాంతి కోసం భారత్ తన శక్తినంతటిని ఉపయోస్తుందన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్న, ఏ రూపంలో ఉన్న భారత్ దాన్ని తుదముట్టిస్తుందని తెలిపారు.

అందుకు భారత త్రివిధ దళాలు ఎల్లప్పుడు సన్నద్ధంగానే ఉంటాయని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ లక్ష్యంగా చేసుకుంటే, భారత్ సరిహద్దు రాష్ట్రాలు, స్కూళ్లు, కాలేజీలు, గురుద్వారాలు, ప్రార్థనా మందిరాలు, జనావాసాలు, మిలటరీ స్థావరాలను పాకిస్థాన్ టార్గెట్ చేసిందని ప్రధాని తెలిపారు.

అయినా పాకిస్థాన్ యత్నాలు ఫలించలేదని, పాక్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు భారత సైన్యం ప్రతిఘటన ముందు కుప్పకూలిపోయాయని చెప్పారు. ఈ పరిస్థితిలో పాకిస్థాన్ డీజీఎంవో కాల్పుల విరమణ అంటూ చర్చలకు వచ్చారని మోదీ తెలిపారు.