13-05-2025 01:10:42 AM
న్యూఢిల్లీ, మే 12: ‘భారత సైన్యం దాడులకు నిలవలేక పాక్ సైన్యం పరుగు అందు కుంది. చేసేదేంలేక కాల్పుల విరమణ అం టూ భారత్ ముందు మోకరిల్లింది. పహ ల్గాం ఉగ్రదాడితో భారత ఆగ్రహానికి గురైన దాయాది భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిం దూర్’తో వణికిపోయింది. భారత్‌కు చెందిన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు విజయవంతం కావడంతో పాక్‌కు ఊపిరాడలేదు.
మూడు రోజులు కూడా గడవకముందే కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరే షన్ సిందూర్ విజయవంతమైంది.’ త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు. సోమవా రం త్రివిధ దళాలకు చెందిన డీజీఎంవో రాజీవ్ ఘాయ్, నౌకాదళం, వైమానిక దళం నుంచి ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆపరేషన్ సిందూర్ గురించి మరిన్ని వివరాలను మీడియాకు వివరించారు.
ఉగ్రవాదులపైనే తమ పోరు అని, ఏ ఒక్క పాక్ పౌరుడికి నష్టం చేకూర్చకుండా ఆపరేషన్ చేపట్టామ ని, భారత గగనతలం దుర్బేధ్యంగా ఉందనిపేర్కొన్నారు. పాక్‌కు న్యూక్లియర్ భయం పట్టుకుందని తెలిపారు. రహీమ్‌యార్‌ఖాన్, నూర్ ఖాన్ వైమానిక స్థావరాలపై దాడులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిం చారు. పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అం డగా నిలిచాయని అందుకోసమే ఈ చర్యలకు దిగామని మరోమారు స్పష్టం చేశారు
చైనా, టర్కీ క్షిపణుల్ని కూల్చేశాం
చైనాలో తయారయిన పీఎల్-15 క్షిపణులతో పాటు టర్కీకి చెందిన క్షిపణులను కూడా పాకిస్థాన్ ప్రయోగించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ వరుసగా దాడులు చేయడం వల్లే మేము స్పందించాల్సి వచ్చింది. ప్రతిగా వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. పాక్‌లోని విమాన స్థావరాలపై దాడులు చేశాం.
ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదుల మౌలిక వసతులను ధ్వంసం చేసేందుకే ఈ ఆపరేషన్ చేపట్టాం. కానీ పాక్ సైన్యం ఉగ్రవాద స్థావరాలను రక్షించాలని చూసింది. అందుకోసమే మేము ఇంతలా దాడులు చేశాం. భారత రక్షణ వ్యవస్థ అత్యద్భుతంగా ఉంది. స్వదేశీ వ్యవస్థలతో రూపొందిన ఆకాశ్ క్షిపణి అసాధారణ పనితీరును ప్రదర్శించింది.
చాలా ఏండ్ల నుంచి ప్రభుత్వం రక్షణకు భారీగా నిధులు కేటాయించడం వల్లే ఇది సాధ్యమైంది. అనేక మానవరహిత విమానాలను పాక్ ప్రయోగించింది. మన రక్షణ వ్యవస్థలు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. పాకిస్థాన్‌లోని కిరానాహిల్స్‌లో అణ్వాయుధ కేంద్రం ఉందని మాకు సమాచారమే లేదు. సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు. కిరానా హిల్స్‌పై మేము దాడి చేయలేదు. పాకిస్థాన్ తనకు జరిగిన నష్టాన్ని తక్కువ చేసి చూపుతోంది.’ అనిఅన్నారు.
ఎల్‌వోసీ దాటకుండానే దాడులు
ఎల్‌వోసీని దాటకుండానే పాక్ స్థావరాలపై దాడులు చేసినట్టు డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్ డీజీఎంవో శనివారం మధ్యాహ్నం 3.35కు ఫోన్ చేశారు. ఆయన అభ్యర్థన మేరకు ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాం. మే 12న మరోసారి చర్చలు జరపాలని అప్పుడే నిర్ణయించాం.
కానీ కొద్ది గంటల్లోనే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఆ కాల్పులకు దీటుగా బదులిచ్చాం. మా సైనిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలు ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్‌లో అన్ని వైమానిక క్షేత్రాలు పని చేస్తున్నాయి.
పాకిస్థాన్ దాడుల వల్ల ఏ ఒక్క వైమానిక స్థావరానికి కూడా నష్టం వాటిల్లలేదు. పాక్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యలు. సైనికులు తదుపరి ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు.’ అని తెలిపారు.
సమన్వయం భేష్..
ఆపరేషన్ సందర్భంగా త్రివిధ దళాలు సమన్వయంతో విధులు నిర్వర్తించినట్టు వైస్ అడ్మిరల్ ప్రమోద్ పేర్కొన్నారు. ‘శత్రువుల విమానాలను దరి చేరకుండా అడ్డుకున్నాం. ఎలాంటి దాడులైనా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయులు స్ఫూర్తిగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు.’ అని వెల్లడించారు.
డీజీఎంవో నోట కోహ్లీ మాట..
డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తన ప్రసంగంలో స్టార్ క్రికెటర్ కోహ్లీ గురించి ప్రస్తావించారు. క్రికెట్‌కు మన గగనతల రక్షణ వ్యవస్థతో పోల్చి ఓ ఉదాహరణ చెప్పారు. ‘ఇవాళే విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన నాకు ఎంతో ఇష్టమైన క్రికెటర్. 1970ల్లో నేను పాఠశాల రోజుల్లో ఉండగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది.
ఆ సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు థామ్సన్, లిల్లీ ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తించారు. అప్పుడు ఆస్ట్రేలియా పత్రికలలో “యాషెస్ టూ యాషెస్, డస్ట్ టూ డస్ట్. ఇఫ్ లిల్లీ డోంట్ గెట్ యూ, థామ్మో మస్ట్” (లిల్లీకి దొరక్కపోతే, థామ్సన్‌కు తప్పకుండా చిక్కాల్సిందే) అనే పదప్రయోగం ఉపయోగించారు.
ఇప్పుడు భారత ఆధిపత్యాన్ని కూడా అలాగే అభివర్ణించవచ్చు. మన గగనతల రక్షణ వ్యవస్థలను చూస్తే మీకు ఇదే అర్థం అవుతుంది. శత్రువులు ఒక దశను ఛేదించినా.. మరో దశకు వారు చిక్కాల్సిందే.’ అని పేర్కొన్నారు.