calender_icon.png 16 November, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

16-11-2025 08:01:07 PM

- తాజాగా ఈషా ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి

- పేదప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు 

- మామూళ్ల మత్తులో వైద్యాధికారులు

ఇబ్రహీంపట్నం: వైద్యం వికటించి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సౌకర్యాలున్నా నిపుణులైన వైద్య సిబ్బంది ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో 24 గంటలు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారనే బోర్డులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ సంబంధిత వైద్యులు లేకపోగా విజిట్‌ డాక్టర్లు, ఎలాంటి స్పెషలైజేషన్‌ లేకుండా కేవలం ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన డ్యూటీ డాక్టర్లతోనే వైద్యం అందిస్తున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినవారు ఆసుపత్రులకు వెళ్తే వారికి అనవసరమైన పరీక్షలు, మందులు రాస్తూ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని ఆసుపత్రుల్లో సరైన నిపుణులు లేకున్నా రెండు, మూడు రోజులు అడ్మిట్‌ చేసుకొని అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌, హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఆసుపత్రుల్లో చేరి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ డ్రైవర్లను సదరు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వారికి కమీషన్లను ఆశగా చూపిస్తూ ఆసుపత్రులకు రోగులను రప్పించుకుంటున్నారు. ఆసుపత్రులకు తీసుకువచ్చే కేసు తీవ్రతను బట్టి, వైద్యానికి అయ్యే ఖర్చును బట్టి 10 నుంచి 30 శాతం మేర కమీషన్లు ముట్టజెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొనసాగుతున్న ఆసుపత్రుల నిర్వాహకులు, కమీషన్లకు కక్కుర్తిపడే ఆర్‌ఎంపీలు, అంబులెన్స్‌ డ్రైవర్లు చేసే నిర్వాకం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కావునా అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

-తాజా ఘటనే ఉదాహరణకు నిదర్శనం..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లింగంపల్లి అనుబంధ గ్రామమైన మనోరమబాద్ కు చెందిన హనుమన్ల పెంటయ్య(55), వృత్తి: సెంట్రింగ్ లేబర్. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం వచ్చిన ఆయన, మంచాల రోడ్డులో వెళుతుండగా కోళ్ల డీసీఎం కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ఈషా హాస్పిటల్ లో చేర్పించారు. సరైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, అందులో ఉన్న కిందిస్థాయి సిబ్బంది చికిత్స అందించడంతో అస్వస్థతకు గురై అతను మృతిచెందాడు. వైద్యం వికటించడంతోననే మృతి చెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

-పట్టించుకోని వైద్యాధికారులు

ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైన సంఘటన జరిగినప్పుడు రెండు, మూడు రోజులు మాత్రమే హంగామా చేస్తూ ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. సదరు ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు నామమాత్రంగా వ్యవహరించడంపై వారికి మామూళ్లు అందుతుండటంతోనే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.