calender_icon.png 16 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

16-11-2025 08:36:13 PM

హనుమకొండ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ లో బీసీ జేఏసీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఆ గెలుపుతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించడం తగదని, ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని,పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లను కేటాయిస్తామంటే ఊరుకునేది లేదని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ గార్డెన్ నుండి అమరవీరుల స్తూపం వరకు బీసీ జేఏసీ నాయకులు రన్ చేశారు.

ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీని బీసీలు ఎప్పటికీ నమ్మరని, బీసీ రిజర్వేషన్లను కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్లు తీసుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి,రిజర్వేషన్ల గురించి ప్రధాని, రాష్ట్రపతిపై ఒత్తిడి పెంచాలని, ఒకవేళ ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ప్రధాని, రాష్ట్రపతి ఇండ్లను ముట్టడించి ధర్నాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తారో, ఇచ్చిన మాట తప్పి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించకుండా స్థానిక సంస్థలకు వెళ్లి బీసీల దోషిగా మారతారో తేల్చుకోవాలన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయనను ఒప్పించి ఇండియా కూటమిలో ఉండే 243 మంది పార్లమెంట్ సభ్యులచే డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలను బీసీ రిజర్వేషన్ల గురించి స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆయన రేవంత్ రెడ్డికి సూచించారు.బీసీలకు అండగా ఉంటే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తే పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్, ఆరెకంటి నాగరాజు గౌడ్, భీమ గాని అశోక్ గౌడ్, ఐలి చంద్రమౌళి గౌడ్, సమ్మయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.