జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి
ఆసిఫాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): బీసీల సమగ్ర కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో న్యాయమైన రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ కు సంఘం నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీల సమగ్ర కులగణనను శాస్త్రీ యంగా, పారదర్శకంగా నిర్వహించి, కులాల వారీగా వాస్తవ జనాభాను అధికారికంగా నమోదు చేయాలని కోరారు. బీసీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయం జరగాలంటే ముందుగా ఖచ్చితమైన జనాభా గణాంకాలు అందుబాటులో ఉండాలన్నారు.కులగణనలో ప్రతి బీసీ కుటుంబం తప్పనిసరిగా నమోదయ్యేలా ప్రత్యేక కేటగిరీ, కాలమ్ ఏర్పాటు చేయాలని, ఏ కుటుంబం లేదా కులం కూడా లెక్కల్లో మిగిలిపోకుండా శాస్త్రీయ విధానంలో గణన చేపట్టాలని కోరారు.
జనాభా గణాంకాల ఆధా రంగా బీసీ రిజర్వేషన్లను పెంచి, విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతిని ధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.బీసీలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేసి, వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న రమేష్, ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరాం, రైతు సంఘం అధ్యక్షుడు వైరాగదే మారుతి, బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, మున్నూరు కాపు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందూరి తిరుపతి, నాయకులు సిరికొండ సాయికృష్ణ, దానపల్లి శంరావు, కుందారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.






