12-10-2025 05:39:16 PM
హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ..
వివాహేతర సంబంధమేనని స్థానికుల అనుమానం..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): అనుమాన్నాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన రాము యాదవ్(30) తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన మానస అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం వారి ఇంట్లో బంగారం చోరికి గురి కావడంతో పెద్దాముద్దునూర్ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బంగారం పోయిన విషయాన్ని మంత్రాలు చేస్తూ బయటపెడతాడని నమ్మి ఆశ్రయించారు.
ఈ క్రమంలో భార్య మానసతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి చేసింది. ఈ క్రమంలో గుడిపల్లి గ్రామంలోని తమ బంధువుల పెళ్లికి వెళ్లిన రాము యాదవ్ ఆదివారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ద్విచక్రవాహనంతో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి గ్రామస్తులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదం వల్లే మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం పోలీసులు సురేష్ తో పాటు భార్య మానసని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.