గర్భిణులకు మంచిర్యాల ఆసుపత్రి
మంచిర్యాల, మే 3 (విజయక్రాంతి): ‘ఆ దవాఖానలో మంచి సౌలత్‌లు ఉన్నయి. వైద్యులు మంచి సేవలు అందిస్తరు. రెండో మాట లేకుండా దవాఖానకు పోవచ్చు. అం దుకు దూరం అడ్డురాదు. రాష్ట్రాల సరిహద్దులు అడ్డురావు’ అనే పేరు చాలా తక్కువ దవాఖానలకు వస్తది. ప్రజలు ఎంతో నమ్మకంగా అక్కడికి వెళ్లి వైద్యం చేయించు కుంటరు. ముఖ్యంగా గర్భిణుల కాన్పుల విషయంలో కుటుంబ సభ్యులెవరైనా అలాంటి దవాఖానలనే ఎంచుకుంటరు. సరిగ్గా అట్లాంటి పేరే తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లాకేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎస్‌సీహెచ్). ఇక్కడ ప్రసవం కోసం మన రాష్ట్రం నుంచే కాదు పొరుగు రాష్ట్రాలై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసగఢ్ నుంచీ గర్భిణులు వస్తుంటరు. జిల్లా ప్రధానాసుపత్రి పరిధిలో ఉండే ఈ ఎంసీహెచ్‌కు మెడికల్, నర్సింగ్ కళాశాల అనుసంధానంగా ఉండడం కలిసివచ్చిన అంశం. మెడిసిన్, నర్సింగ్ విద్యార్థు లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తుండడంతో దవాఖానకు అంతకుఅంత ఆదరణ పెరుగుతున్నది. ఒకవైపు రోజువారీ ఓపీ పెరగడమే కాక మరోవైపు ఎంఎసీహెచ్‌కు ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య సైతం పెరిగింది.
నాలుగు నెలల్లో ప్రసవాలు ఇలా...
ఎంసీహెచ్‌లో జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు వైద్యులు 1,367 మంది గర్భిణులకు ప్రసవాలు చేశారు. వీరిలో మహా రాష్ట్రం నుంచి 60 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి ఆరుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు గర్భిణులు ఉన్నారు. అలాగే మంచిర్యాల జిల్లాకు చెందిన వారు 807 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 395, కరీంనగర్ జిల్లా నుంచి ఐదుగురు, పెద్దపల్లి జిల్లా నుంచి 30 మంది, నిర్మల్ జిల్లా నుంచి ముగ్గురు, జగిత్యాల జిల్లా నుంచి ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లా నుంచి పది మంది, హైదరాబాద్‌కు చెందిన వారు తొమ్మిది మంది, హనుమకొండ జిల్లా నుంచి ముగ్గురు, సిద్దిపేట నుంచి ఒకరు, నిజామాబాద్ జిల్లా నుం చి ఐదుగురు, మహబూబాబాద్ జిల్లా నుం చి ఇద్దరు, భూపాలపల్లి నుంచి 17 మంది, రంగారెడ్డి, ములుగు, మేడ్చల్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంచిర్యాల ఎంసీహెచ్‌లో పురుడు పోసుకున్నారు.
నాణ్యమైన వైద్యం కోసమే
మాది కోటపల్లి మండలం పార్‌పల్లి. మా మెట్టినిల్లు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం. ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అంతంతమాత్రం. మా ఊరి నుంచి గర్భిణులు ఎక్కువగా కాన్పుల కోసం భూపాలపల్లికి వస్తుంటరు. నాకు ఇది మొదటి కాన్పు. గర్భం దాల్చిన నాటి నుంచి నేను మంచిర్యాల ఎంసీహెచ్‌లోనే వైద్యసేవలు పొందుతున్నాను. కాన్పు కోసం మళ్లీ ఇక్కడికే వచ్చాను. తెలంగాణలో మంచి దవాఖానలు ఉన్నయి. అందుకే నా భర్త నవీన్‌కుమార్ ఇక్కడే కాన్పు చేయించాలని పట్టుబట్టిండు. నాణ్యమైన వైద్యం కోసమే ఇక్కడి వచ్చిన. మాకు పండంటి పాప మాకు పుట్టింది. చాలా ఆనందంగా ఉంది.
కల్లూరి సమత, బాలింత, భూపాలపట్నం, ఛత్తీస్‌గఢ్
డాక్టర్లంటే నమ్మకం
మా స్వస్థలం మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లా సిరోంచా మండలం ఆసరవెల్లి. మొదటి నుంచి నాకు ఆరోగ్యం బాగా లేకుండె. నేను వైద్యం కోసం తరచూ తెలంగాణలోని చెన్నూ ర్, మంచిర్యాలకు వస్తుంటా. నాకు ఇది రెండో కాన్పు. మొద టి కాన్పు చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అయిది. బాబు పుట్టిండు. రెండో కాన్పుకు మంచిర్యాల ఎంసీహెచ్‌కు వచ్చిన. నా భర్త సమ్మయ్యకు ఇక్కడి డాక్టర్లంటే నమ్మకం.
భవాని పరధాని, బాలింత, ఆసరవెల్లి, మహారాష్ట్ర
మెరుగైన సేవలు
మహారాష్ట్రలోని సిరొంచా మా స్వగ్రామం. మెట్టినిల్లు ఏపీలో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం. నా మొదటి కాన్పు మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. దేవుడి దయవల్ల రెండు కాన్పులు మంచిర్యాల ఎంసీహెచ్‌లో జరిగింది. సాధారణ ప్రసవం కోసం కొన్ని గంటల పాటు ఎదురుచూశారు. కానీ తప్పనిసరి పరిస్థితిలో సిజేరియన్ ఆపరేషన్ చేశారు. నేనూ నా బిడ్డ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం.
వేల్పుల రంజిత, బాలింత, సిరోంచా, మహారాష్ట్ర




