రాహుల్ గాంధీతోనే సంక్షేమ పాలన సాధ్యం
ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ రఘురాంరెడ్డి
ఖమ్మం, మే 5 (విజయక్రాంతి): ఎలాంటి మత విద్వేషాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించడం రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డు శ్రీదేవి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన స్థానికులు, వివిధ పార్టీల నాయకులు, మేధావులను ఉద్దేశించి రఘురాంరెడ్డి మాట్లాడారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందరూ హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొల్లికొండ శ్రీదేవి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మక్కా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




