27-11-2025 10:19:37 PM
మానే రామకృష్ణ..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ బలపరుస్తున్న మానే రామకృష్ణ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మానే రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదిస్తే భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భద్రాచల రామ క్షేత్రంకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు శాయాశక్తుళా ప్రయత్నిస్తానన్నారు. పట్టణంలో ఉన్న 20 వార్డులలో రహదారుల, డ్రైన్ల సమస్యలను పరిష్కరించి వీధి వీధిలో విద్యుత్ వెలుగులను నింపుతానన్నారు. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించి డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసి పట్టణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజా దర్బారు నిర్వహించి, తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
పట్టణ బ్యూటిఫికేషన్ లో భాగంగా మరిన్ని పార్కులు ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణన్ని నెలకొల్పుతామన్నారు. గిరిజన, గిరిజనేతరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుత వాతావరణంలో పట్టణాన్ని నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూస్తానని, వరదల సమయంలో స్లీసులు లీక్ కాకుండా పటిష్ట చర్యలకు మాస్టర్ ప్లాన్ చేస్తామని వెల్లడించారు. విద్య, వైద్య, విద్యుత్తు సమస్యలు లేకుండా చూస్తానన్నారు. అదేవిధంగా యువతకు క్రీడ అభివృద్ధికి చేయూతనిస్తానన్నారు. నిరుద్యోగులకు గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి పరిచి వారి ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు చర్యలు తీసుకుంటానన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెంపుల్ సిటీ అభివృద్ధికి బీజం పడిందని ఆయన గుర్తు చేశారు.