27-11-2025 10:24:23 PM
మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్
మునిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ హెచ్చరించారు. గురువారం స్థానిక పీఎస్ లో స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా మూడు విడతలుగా జరగనున్న ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున రూ. 50 వేలకు మించకుండా తమ వెంట తీసుకెళ్లవద్దన్నారు. అలాగే రూ.50 వేలకు మించి డబ్బులు, నగలు వంటి విలువైన వస్తువులు ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు తప్పని సరిగా పెట్టుకోవాలని, అందుకు సంబంధించి పత్రాలు లేనిచో వాటిని సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా జప్తు అయిన వస్తువలకు సంబంధించి సరైన పత్రాలు చూపించిన తరువాత తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన నియమనిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం, శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రజలందరూ గమనించి ఎన్నికలను సజావుగా సాగేలాచూసి తమకు సహకరించాలని కోరారు.