27-11-2025 11:04:56 PM
హిల్ట్ పీ పాలసీతో ఇష్టారీతిన భూముల పంపకాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
హైదరాబాద్ (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని, పాలసీల పేరు మీద కాంగ్రెస్ పాలకులు స్కాములు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్క్యామ్ తెలంగాణలో జరుగుతుందని, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, రేవంత్ రెడ్డి ఆత్మీయ బంధువులు 40 మందికి అప్పగించేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పీ పాలసీతో హైదరాబాద్ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పుకుంటూ , ఓఆర్‌ఆర్ దగ్గర ఎకరం రూ.137 కోట్లు పలికిందని చెప్తున్న ప్రభుత్వం, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములని కారు చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి ఇలాంటి హిల్ట్ పి పాలసీ తీసుకొచ్చారని, మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించారని విమర్శించారు. పారిశ్రామిక వాడలోని భూములను ఎవరికీ కేటాయించారో వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.