calender_icon.png 28 November, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేమ్ బోర్డుల అనుమతులు ఇక ఈజీ

27-11-2025 10:55:18 PM

సర్కిల్ కార్యాలయాల్లోనే అనుమతులు

యాడ్స్ పర్మిషన్ల కోసం హెడాఫీస్ చుట్టూ తిరగక్కరలేదు 

సంబంధిత డిప్యూటీ కమిషనర్లకే వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలి 

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్  

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): నగరంలోని వాణిజ్య, వ్యాపార సంస్థల నిర్వాహకులకు జీహెచ్‌ఎంసీ గుడ్‌న్యూస్ చెప్పింది. దుకాణాల పేర్లు నేమ్ బోర్డులు, ప్రకటనల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఈ అనుమతుల కోసం వ్యాపారులు ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ.. అనుమతుల జారీ ప్రక్రియను వికేంద్రీకరిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతుల జారీలో జాప్యాన్ని నివారించి, పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.

తాజా ఆదేశాల ప్రకారం.. ఇకపై నేమ్ బోర్డులు, సైన్ బోర్డుల అనుమతులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాకుండా, ఆయా సర్కిల్ కార్యాలయాల్లోనే ప్రాసెస్ చేయబడతాయి. వ్యాపారులు తమ పరిధిలోని డిప్యూటీ కమిషనర్‌ను సంప్రదించి అనుమతులు పొందవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, సేవలు వేగవంతంగా అందుతాయని అధికారులు వెల్లడించారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియ మాత్రం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సాగుతుందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ప్రకటనలు, నేమ్ బోర్డు అనుమతులు కావాల్సిన వారు తప్పనిసరిగా  పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నూతన విధానాన్ని సద్వినియోగం చేసుకుని, వేగవంతమైన సేవలు పొందాలని కోరింది.