calender_icon.png 28 November, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి, అక్రమాలకు నిలయంగా కాళోజీ వర్సిటీ

27-11-2025 11:10:05 PM

వీసీని విధుల్లో నుంచి తొలగించాలి..

గవర్నర్, ఎన్‌ఎంసీ చైర్మన్లకు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ..

హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మకమైన కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇటీవల ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు, ఎన్‌ఎంసీ చైర్మన్‌కు గురువారం హరీశ్‌రావు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, విలువల్లేని తనానికి నిదర్శనమని విమర్శించారు.

వైద్య విద్య మార్కుల రీ-వాల్యుయేషన్ ప్రక్రియపై కొద్ది రోజులుగా వరుసగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డా. నందకుమార్ రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కాళోజీ యానివర్సిటీ స్కాం విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదని అడిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్స్‌లర్ నందకుమార్ రెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించాలని, యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.