calender_icon.png 28 November, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల గొంతు కోసిందే బీఆర్‌ఎస్

27-11-2025 10:57:33 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్..

హైదరాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. గురువారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిందని పేర్కొన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆమె స్పష్టం చేశారు.

బీసీలకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ర్టం యూనిట్ గా సర్పంచ్ రిజర్వేషన్లను టీఆర్‌ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్ గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్‌గా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు.

కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు అయినట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. కొన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో ఆ పరిమితిని దాటి పోకుండా ఉండేందుకు బీసీ రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగినట్లు స్పష్టం చేశారు. సర్పంచుల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, జడ్పీటీసీలకు జిల్లాను, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నామని వివరించారు.