calender_icon.png 28 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై పోరాడండి

27-11-2025 11:19:48 PM

బీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన..

హైదరాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. బీసీ సంఘాల పోరాటం తమపై కాదని వాటిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని, కానీ, బీజేపీ, బీఆర్‌ఎస్ సహకరించలేదని మంత్రి ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

రిజర్వేషన్లకు అడ్డుపడిన బీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పుడు బీసీల విషయంలో మొసలు కన్నీరు కారుస్తున్నాయని దుయ్యబట్టారు. బడుగు, బలహీనవర్గాలకు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులే ద్రోహులన్నారు.  పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు శాతాలపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు తప్పకుండా అధికారికంగా వివరణ ఇస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేవన్నారు. బీసీ సంఘాల ఆకాంక్షలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, మీ ఆకాంక్షల్లో మేమూ భాగస్వామ్యులమేనన్నారు. ప్రభుత్వం తరఫున ఏదైనా లోపాలు ఉంటే చూపించాలని కోరారు.