09-11-2025 12:11:53 AM
కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో కలిసి ఇటీవల ‘కాంతార: చాప్టర్1’లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అందాల తార రుక్మిణీ వసంత్. ‘ఎన్టీఆర్ ప్రాజెక్టులోనూ ఈ అమ్మడే కథానాయిక. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ రుక్మిణి తలుపు తట్టిందని సమాచారం. చాలా కాలం తర్వాత దర్శకుడు మణిరత్నం మరో ప్రేమకథతో రానున్నారు. మనసులను హత్తుకునే ప్రేమకథలకు కేరాఫ్‌గా నిలిచే ఆయన ఈ చిత్రంతో తన మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
అయితే, మణిరత్నం.. ఈ ప్రాజెక్టు కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో చేతులు కలిపినట్టు సమాచారం. విజయ్, మణిరత్నం కాంబోలో 2018లో తొలిసారి ‘చెక్క చివందా వానం’ వచ్చింది. తొలి కలయికలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అదరగొట్టిన వీళ్లు ఇప్పుడు రొమాంటిక్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. లోతైన భావోద్వేగాలు, అనుబంధాలతో రూపుదిద్దుకోనున్న.
ఈ ప్రేమకథలో అందాల భామ రుక్మిణీ వసంత్‌ను కథానాయికగా ఎంపిక చేసే పనిలో చిత్రబృందం ఉందని టాక్. ఇదిలావుండగా, కన్నడ స్టార్ యష్ నటిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’లోనూ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో చివరి దశ చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ను వెంకట్ కే నారాయణ, యష్ నిర్మిస్తున్నారు.
దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కన్నడ, ఆంగ్ల భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. 2026 మార్చి 19న థియేటర్లలోకి రానున్న ఈ ప్రాజెక్టు గురించి రుక్మిణి ఇటీవల అభిమానులతో జరిగిన చిట్‌చాట్‌లో తెలిపింది. “టాక్సిక్’ రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. ఎంతో హృద్యంగానూ ఉంటుంది” అని రుక్మిణి చెప్పింది.