calender_icon.png 9 November, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడ చూసినా కొమురక్క చర్చే...

09-11-2025 09:20:54 AM

- రూ. 3 లక్షలిస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు...

- ఆడియో రికార్డ్ వైరల్.. హాల్ చల్...

- ఇళ్ల పేరిట అమాయకులకు దళారుల గాలం...

- వార్డుకు ఇద్దరికీ ఛాయిస్...

- వాట్సాప్ గ్రూపులోవాడీవేడీగా చర్చ...

- అవినీతికి తెర తీసిన నాయక దళారీలు...

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): కొమురక్క  గుడ్ మార్నింగ్.. అని ముచ్చట మొదలు అయితది... రూ. 3 లక్షలు ఇస్తే డబుల్ బెడ్ రూం ఇప్పిస్తాం.., వార్డుకు ఇద్దరికీ అవకాశం  ఉంటది.., మీ వార్డులో ఎవరైనా పేద వారుంటే చెప్పు కొమురక్క.. అని ఓ కాంగ్రెస్ లీడర్ సంభాషణ సాగుతోంది... మనకి ఏఐసీసీ చానల్ దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం... తప్పకుండా పని అయితది, మోసం లేదని ఆ లీడర్ చెబుతుండగా.. కొమురక్క ఆ మాటలను అస్సలు నమ్మదు... కానీ సదరు లీడర్ నమ్మించేందుకు చాలా విషయాలు చెప్పుకొస్తాడు... బెల్లంపల్లిలో నిర్మాణమైన డబుల్ బెడ్ రూంల పంపకాలకి ముందు బెల్లంపల్లి కాంగ్రెస్ లోని ఓ వర్గం భారీ స్కెచ్ అనూహ్యంగా లీకైంది.

ఎట్టకేలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎట్టకేలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొలిక్కి  వచ్చింది. ఇండ్ల పంపకాలకు రెవెన్యూ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. పట్టణంలోని కన్నాల ప్రధాన రహదారి పక్కన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు బెడ్ రూం ఇండ్లకు నాంది పలికింది. ఆ మేరకు అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 2018లో అధికార యంత్రాంగం ఎంతో ఆర్భాటంగా డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ఇండ్లు పూర్తి కాలేదు. రెండు గదుల ఇండ్ల నిర్మాణం పూర్తి కావడానికి పుష్కరకాలం పట్టింది. 

అవినీతికి తెర తీసిన నాయక దళారీలు...

బెల్లంపల్లిలో మొదటి విడతగా 160 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి నాంది పలికారు. ఇప్పటి వరకు 108 ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ఈ ఇండ్లకే నిరుపేద ప్రజల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఇదే నేపథ్యంలో దళారులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ గల్లీ లీడర్లు నుంచి మొదలు ఉన్నత స్థాయి లీడర్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని పైరవీలకు తెర తీశారు. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల చొప్పున వసూళ్లకు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే కొందరి నుంచి ముడుపులు వసూలైనట్లు ప్రచారం జరుగుతోంది.

వార్డుకు ఇద్దరికి అవకాశం...!

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులున్నాయి. కొంత మంది కాంగ్రెస్ దళారీ నాయకులు వార్డుకు ఇద్దరి చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పించేకు అవకాశం ఉందని బుకాయిస్తూ మోసగించేందుకు బహురూపుల వేశగాళ్ల అవతారం ఎత్తారు. సాక్షాత్తు ఓ కాంగ్రెస్ గల్లి లీడర్ మరో మహిళా కాంగ్రెస్ నేతతో మాట్లాడిన మాటల ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్డుకు ఇద్దరు చొప్పున రూ. 3 లక్షలు ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని ఆయన ఆ మహిళా నేతతో చేసిన సంభాషణ  ఆడియో పట్టణంలో తీవ్ర దుమారం లేపింది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పెద్ద ఎత్తున దండుకునేందుకు ఓ ముఠా తన సహచరులను రంగంలోకి దింపింది. ప్రతి వార్డు నుంచి ఇద్దరి చొప్పున రూ. 6 లక్షల టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎరగా చూపి అందినకాడికల్లా దండుకునే పనిలో దళారులు కాచుకొని కూర్చున్నారు. రెచ్చిపోయిన దళారుల వల్ల ఎంతమంది లబ్ధిదారులు మోసపోతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కొమురక్కతో సంభాషణ పట్టణంలో హాట్ టాపిక్ గా మారడంతో కాంగ్రెస్ నాయకుల అవినీతి గూడు పుఠాణి బట్టబయలైనట్లైంది. ఈ సంభాషణలు పార్టీని అప్రతిష్ట పాలు చేసిందని చెప్పవచ్చు.

ఎవరికి డబ్బులివ్వొద్దు: గడ్డం వినోద్, శాసన సభ్యులు, బెల్లంపల్లి

కొంత మంది దళారులు మూడు లక్షలు ఇస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తామని ప్రచారం జరుగుతుంది. వీటిని అమాయక ప్రజలు నమ్మి డబ్బులు ఇచ్చి మోస పోవద్దు. అసలైన నిరుపేద కుటుంబాలకే ఇండ్లు కేటాయిస్తాం. అధికారులతో పకడ్బందీగా సర్వే చేయించాం. నాయకులైనా, అధికారులైనా ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. ఎవరినైనా ఉపేక్షించేది లేదు, చర్యలు తప్పవు.