09-11-2025 01:19:02 AM
న్యూఢిల్లీ, నవంబర్ 8: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మం త్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశాలు ప్రజా ఆకాంక్షలను నెరవేర్చి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా జరగాలని ఆకాంక్షించారు.
సభ్యులు నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. అయితే.. అవసరాన్ని బట్టి ఆయా తేదీల్లో మార్పులు ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు యేటా నవంబర్ మూడోవారంలో ప్రారంభమై క్రిస్మస్ కంటే ముందు ముగుస్తాయి. కేంద్రప్రభుత్వం ఈసారి సమావేశాలను కుదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభల్లో 12 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను మాత్రమే సభ్యులు ఆమోదించగలిగారు.
‘ఆపరేషన్ సింధూర్’, బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పైై చర్చ పెట్టి తీరాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. సమావేశాల నిర్వహణకు తీవ్రమైన అంతరాయం కలిగింది. ఈసారైనా సమావేశాలు సజావుగా జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
గతేడాది జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా అంతే ఉద్రిక్తంగా సాగాయి. అప్పటి ఉపరాష్ర్టపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతోపాటు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని ప్రతిపక్షం పట్టుబడడంతో అనేకసార్లు సమావేశాలకు అంతరాయం కలిగింది.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ స్పందిస్తూ.. పార్లమెంట్ సమావేశాలను కొద్దిరోజులకు కుదించడం దారుణమని మండిపడ్డారు. ‘పార్లమెంట్ -ఫోబియా’తోనే ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ సభ్యులు సమావేశాలను కుదించారని ఆరోపించారు. ఏఐసీసీ సీనియర్ నేత, రాజ్యసభ చీఫ్ విప్ జైరాం రమేష్ స్పందిస్తూ..
సమావేశాల నిర్వహణను కుదించి కేంద్ర ప్రభు త్వం దేశానికి ఏం సందేశమివ్వాలనుకుంటుందో దేశప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యులు దేశ ప్రజల తరఫున ఎన్నో విషయాలను చర్చకు పెట్టాలనుకుంటారని, అందుకు చోటు లేకుండా సమావేశాలను కుదించడం అప్రాజాస్వామికమని ధ్వజమెత్తారు.