calender_icon.png 20 May, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వారికే ఇందిరమ్మ ఇల్లు..

19-05-2025 08:25:04 PM

ఇందిరమ్మ ఇండ్ల సర్వే బోగస్..

పేదలకు చేటు-అనర్హులకు చోటు..

అధికారులు అవకతవకలకు చెక్ పెట్టాలి..

లేదంటే అక్రమాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం..

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్..

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం(Indiramma Housing Scheme)లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే ఇందిరమ్మ ఇండ్ల రీ సర్వేను నిర్వహించాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్(Poonam Pradeep Kumar) డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఇష్టా రీతిగా వ్యవహరించి గ్రామపంచాయతీ కార్యదర్శులను చెప్పుచేతల్లో పెట్టుకొని తమకు అనుకూలమైన వారికి, అనర్హులైన వారికి ఇండ్లు కేటాయించారని అన్నారు. 

నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని, బిల్డింగులు, భూములు, వాహనాలు ఉన్న వారి పేర్లనే ఇండ్ల సర్వేలో చేర్చారని తెలిపారు. నిరుపేదలు, జాగా ఉండి ఇండ్లు లేనివారికి, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించలేదని ఇది వాస్తవమని పేర్కొన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ భద్రాచలం నియోజకవర్గంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, తప్పుడు సర్వే చేసి అనర్హులకు ఇండ్లు కేటాయించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంట్లో కేటాయింపులో కాంగ్రెస్ నేతల కుటిల బుద్ధి బట్టబయలైందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించాల్సింది నాయకులు కాదని, అధికారులకు ఈ విషయం సోయలేదని ఆరోపించారు. సర్వేను రాజకీయ నాయకులు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.  భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్  తెల్లం వెంకట్రావు ఈ అక్రమ సర్వే పై తగు చొరవ తీసుకొని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా కృషి చేయాలని  కోరారు. రీ సర్వే చేసి అర్హులను ఎంపిక చేయకపోతే, అక్రమ సర్వే పేర్ల జాబితాను కోర్టు దృష్టికి తీసుకువెళ్లి నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తామని పూనెం ప్రదీప్ కుమార్ హెచ్చరించారు.