19-05-2025 08:19:37 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో ఈనెల 17న అల్లుడు లకావత్ బాలను కత్తితో పొడిచి చంపిన ఘటనలో మామతో పాటు భార్య అత్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మామ భానోతు వీరన్న, బాల భార్య మౌనిక, అత్త బానోతు కైలాను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు(DSP Tirupati Rao) తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం... హత్య ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మారం తండాకు చెందిన భానోతు వీరన్న కైలా దంపతులు తమ కూతురు మౌనికను 9 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని బల్లర్షకు చెందిన లకావత్ బాలకు ఇచ్చి వివాహం చేశారని చెప్పారు. బాల, మౌనిక దంపతులు ఉపాధి కోసం హైదరాబాదులో ఉంటున్నారని చెప్పారు. మృతుని భార్య మౌనిక మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయంలో గొడవలు జరుగుతుండగా మృతుని భార్య ధర్మారం తండాలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చిందన్నారు.
ఈ క్రమంలో బాల తన సోదరుడు బావు సింగ్ తో కలిసి ఈనెల 17న ధర్మారం తండాకు రాగా బాల తన భార్య మౌనిక అక్రమ సంబంధం విషయంలో గొడవ పడుతుండగా, బాలను చంపాలనే ఉద్దేశంతో మామ, అత్త, భార్య కలిసి బాల, బావు సింగ్ కంట్లో కారం చల్లి, దాడి చేసి అల్లుడు బాలా చాతిలో వీరన్న కత్తితో పొడిచాడని చెప్పారు. దీనితో అతన్ని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రాత్రి 10 గంటల సమయంలో చనిపోయాడని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ఏ సముద్రం ఎస్సై జి.మురళీధర్ రాజ్, పి ఎస్ ఐ కే.రవి కిరణ్, సిబ్బంది ఐలయ్య రాజు వెంకన్న రాజేందర్ లను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించినట్లు డిఎస్పి తెలిపారు.