calender_icon.png 8 November, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి ముఠా అరెస్ట్

08-11-2025 01:09:01 AM

  1. ఓ వెంచర్‌లో విక్రయిస్తూ ఓ బాలుడితో సహా ఐదుగురి అరెస్ట్   
  2. 138 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు,  బైక్ స్వాధీనం

నాగర్ కర్నూల్, నవంబర్ 7 (విజయక్రాంతి):నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి బహిరంగ విక్రయాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత నెల 26న నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిలో ఎండు గంజాయి విక్రయిస్తూ 8 మంది యువకులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అది మరువక ముందే శుక్రవారం తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ వెంచర్ లో కొంతమంది యువకులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు.

డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ లోని దూల్‌పేటన ఆకాష్ సింగ్  నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బొందల రేణు కుమార్ కిలో గంజాయిని కొనుగోలు చేశాడు. జిల్లా కేంద్రంలోని లాడ్జి కేంద్రంగా విక్రయాలు జరిపాడు ఆ ఘటనలో 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా బొందల రేణు కుమార్ సోదరుడు గణేష్ అనే వ్యక్తి నుంచి  నారాయణ,  చరణ్, అఖిల్ అనే వ్యక్తులతో పాటు మరో మైనర్ బాలుడు గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

పక్కా సమాచారంతో దాడులు జరపగా వారి వద్ద ఉన్న 138 గ్రాముల ఎండు గంజాయిని, ఒక ద్విచక్ర వాహనం రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ప్రాంత వ్యక్తి నుండి కిలో గంజాయి కొనుగోలు చేయగా ఈనెల 26న 735 గ్రాములు స్వాధీనం చేసుకోగా మరో 138 గ్రాములు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మరో 127 గ్రాముల గంజాయి ఎవరెవరికి విక్రయించారన్న అంశంలో లోతైన విచారణ జరగాల్సి ఉంది. గంజాయి సేవించేవారిలో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. సమావేశంలో ఎస్‌ఐ నరేష్, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు.