08-11-2025 10:05:49 PM
-ప్రైవేటు బస్సు డ్రైవర్ పై దాడి, బస్సు అద్దాలు ధ్వంసం..
-తీవ్ర భయాందోళన గురైన బస్సులో ఉన్న ప్రయాణికులు..
-చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన..
-కేసు నమోదు, దర్యాప్తు, గాలింపు ముమ్మరం..
ఎల్బీనగర్: తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి(65)పై శుక్రవారం అర్ధరాత్రి అల్లరి మూకలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలపై అల్లరి మూకలు ప్రధాన రోడ్ల వెంట పెద్ద ఎత్తున గాండ్రింపుతో కేకలు వేస్తూ కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ సమీపంలో బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారిపై 65పై వెళుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అకారణంగా అడ్డగించి డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం రాళ్లతో బస్సు అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎస్వీటి ప్రైవేటు ట్రావెల్స్ ఎన్ఎల్ 01 బి 9333 నెంబర్ గల బస్సు దాదాపు 43 మందితో హైదరాబాద్ బీరంగూడ నుండి పామూరుకు బయలుదేరింది.
బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్, బస్ క్లీనర్ కళ్ళూరి వెంకటనారాయణ కొత్తపేట చౌరస్తా సమీపంలోని విక్టోరియా మెట్రో స్టేషన్ వద్దకు అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు ద్విచక్రవాహనంపై బస్సుకు ఎదురుగా వచ్చి విగ్రహా అరుస్తూ బస్సు డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో పాటు బస్సు అర్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ సంఘటనపై బాధ్యత బస్సు డ్రైవర్ చైతన్యపురి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలిపు చర్యలు చేపట్టినట్లు సీఐ కే.సైదులు వెల్లడించారు.