08-11-2025 01:08:50 AM
-కాంగ్రెస్‌ది మోసాల పాలన
-జూబ్లీహిల్స్ అభివృద్ధిని గాలికొదిలేశారు
-హిందువుల ఓట్లంటే కాంగ్రెస్‌కు లెక్కలేదు
-మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి
-నిజమైన మార్పు, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సిటీబ్యూరో నవంబర్ 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీ లో వేసినట్లేనని కేంద్ర మంత్రి, జి. కిషన్‌రెడ్డి చెప్పారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగం గా కేంద్రమంత్రి, జి.కిషన్‌రెడ్డి అధికార కాం గ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలపై కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఎర్రగడ్డ, హైమావతి నగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ రెండు పార్టీల వైఫల్యాలను ఎండగట్టారు.
అభివృద్ధి శూన్యం..సమస్యలు అపారం
గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఇక్కడ గెలిచినా జూబ్లీహిల్స్ తలరాత మారలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మురుగునీరు పొంగి పొర్లుతోంది, వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి, రాత్రిపూట వీధి దీపాలు వెలగడం లేదు. కేసీఆర్ జూబ్లీహిల్స్ వీధుల్లో పాదయాత్ర చేస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ నిన్నటి పార్టీ..
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్‌ఎస్ పార్టీ నిన్నటి ముచ్చట. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి, కేసీఆర్ తన ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. రాష్ట్రాన్ని బంగారం చేస్తానని చెప్పి, తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారు, అని ఎద్దేవా చేశారు.
‘రవ్వంత రెడ్డి’లా ఎగిరి పడుతున్నావ్
సీఎం రేవంత్ రెడ్డి రవ్వంత రెడ్డి లా ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. అబద్ధపు హామీల తో ప్రజలను మోసం చేస్తున్నారు. రెండేళ్లలో ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఎక్కడ. విద్యార్థుల కోసం విద్యా భరోసా కార్డులు ఏమయ్యా యి.. దళితులకు రూ.12 లక్షల హామీ, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఏమైంది..కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా, రూ.4000 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి అని పిలుపునిచ్చారు.
హిందువుల గౌరవం పట్టదా..
కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మెహదీపట్నం, ఎర్రగడ్డలో శ్మశానవాటికల కోసం స్థలం ఇవ్వడానికి మనసొచ్చిన ప్రభుత్వానికి, బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఇవ్వడానికి మనసు రాలేదు. ముస్లింలు కాం గ్రెస్‌కు ’ఇజ్జత్’ అయితే, హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్‌రెడ్డి. మీ ప్రభుత్వంలో హిందువులకు గౌరవంలేదా? అన్నారు.
మైనారిటీ ఓట్ల కోసమే మంత్రి పదవి..
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేవలం జూబ్లీహిల్స్ మైనారిటీ ఓట్లను కొల్లగొట్టే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కేవలం ఉపఎన్నికలో గెలవడం కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారు. పాతబస్తీలో మజ్లిస్ రౌడీయిజం వల్ల వందలాది హిం దూ బస్తీలు ఖాళీ అయ్యాయి. అలాంటి పరిస్థితులు రాకూడదు అని హెచ్చరించారు.
మార్పు కోసం బీజేపీకి ఓటెయ్యండి..
డబ్బులిచ్చి ఓట్లు కొనాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు, కానీ జూబ్లీహిల్స్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరు. నిజమైన మార్పు, అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీకి ఓటు వేయండి అని ఆయన విజ్ఞప్తి చేశారు.