29-10-2025 02:25:23 PM
ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు
సాయం కోసం ప్రజల ఎదురుచూపులు
అచ్చంపేట: మొంథా తుఫాను ప్రభావం నల్లమలలోని ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట మండలం పరిధిలోని మార్లపాడు, కేశ్యతండా గ్రామాల ప్రజలు జులాదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వర్షం ఉధృతితో సమీపంలోని చెరువులు వాగులు తెగిపోవడంతో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలువురి రైతుల పశుసంపద నీటిలో కొట్టుకుపోయింది. ఈ రెండు గ్రామాలు మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీకి అనుబంధంగా నిర్మిస్తున్న నక్కలగండి జలాశంలో ముంపు గ్రామాలుగా ప్రకటించారు. వీరికి పునరావసం కల్పిస్తామని ఇప్పటికీ న్యాయం చేయలేదు. దీంతో జలాశయంలో భూములు కోల్పోయిన ప్రజలు పునరావాసం, మెరుగైన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం లేకపోవడంతో సమీపంలోని చెట్ల కింద పశువుల కొట్టాల కింద నిలబడి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షం నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో పత్తి, వరి ధాన్యాలు పూర్తిగా తడిసిపోయాయి. వాటిని అతి కష్టం మీద రైతులు సంచుల్లో నింపుకొని ఇతర ఎత్తైన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల్లోని పశువులు నీటి ఉధృతిలో కొట్టుకుపోయావని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు బోరు మోటర్లు పొలాల్లోనూ పంటలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం మార్లపాడు తండా, కేష్యతాండ గ్రామాల చుట్టూ భారీగా వర్షం నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సెల్ ఫోన్ లలోనూ చార్జింగ్ లేదని.. ఒక రకంగా సమాచారం బయట వ్యవస్థలకు తెలియజేసే అవకాశం లేకుండా పోయిందని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు తీవ్రంగా ఉండటంతో ఇళ్లల్లో వంట చేసుకోలేదని వృద్ధులు చిన్నారులు ఆకలితో అవస్థలు పడుతున్నామని తెలిపారు. రెండు గ్రామాల ప్రజలు అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామస్తులకు ఎలాగైనా కనీసం ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలని పలువురూ గ్రామస్తులు విజయక్రాంతితో ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే సహాయ చర్యలు ప్రారంభం: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
మార్లపాడు తండా, కేశ్యాతాండ ప్రజలకు తక్షణమే సహాయ చర్యలు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విజయక్రాంతితో తెలిపారు. గ్రామస్తులకు ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేయాలని డి.ఎస్.పి కి సూచించానని చెప్పారు. వెంటనే వారికి ఆహారం అందే విధంగా చూస్తారని అన్నారు. అలాగే వారికి పునరావాస కల్పన చర్యలను వీలైనంత త్వరగా ప్రారంభించి నెల రోజుల్లో పూర్తిచేసేలా చూస్తామన్నారు. ఇప్పటికే రెండు గ్రామాల ప్రజలు కొంతమంది మన్నె వారి పల్లి కి చేరుకున్నారని వారికి సైతం అవసరమైన అన్ని రకాల సహాయ చర్యలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పారు. రెండు గ్రామాల ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను పోలీస్, రెవిన్యూ, ఇతర శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. సమస్య గురించి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా అచ్చంపేట తహసిల్దార్ ఫోన్ లో స్పందించలేదు.