29-10-2025 04:48:41 PM
బురదలో పందుల స్వైర విహారం..
ముక్కు మూయకుంటే వెళ్లడం కష్టం..
రోగాల బారిన పడడం పక్క..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న విష్ణు లాడ్జ్ పక్క నుండి కూరగాయలు, ఫిష్, మటన్ చికెన్ మార్కెట్ కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన దుర్గంధం వెదజల్లుతుంది. బురదలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన దారి గుండా ఉన్న హోటల నుండి వచ్చే మురుగు నీరుతో పాటు ఆ దారిలో ఉన్న దుకాణ సముదాయాల మురుగునీరు వెనుకకి వదలడంతో పెద్ద ఎత్తున బురద కూడిన గుంత ఏర్పడింది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఆ రోడ్డు గుండా మార్కెట్ కి ప్రజలు కాలినడకన వెళుతుంటారు.
విపరీతమైన దుర్గంధం వెదజల్లడంతో ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో బురదలో పందులు స్వైర విహారం చేయడం వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిందని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఓ పక్క దుర్గంధం మరోపక్క దోమల సమస్యతో సతమతమవుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇలాగే ఉంటే ఆసుపత్రిలో పాలు అవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.