09-01-2026 12:52:55 AM
1.2 కోట్ల సరుకు సీజ్
ఉక్కుపాదం మోపుతున్న అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సమీపి స్తున్న వేళ నగరంలో చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టిన అధికారులు నగరం లో భారీ డంప్‌ను గుట్టు రట్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఏకంగా రూ. 1.2 కోట్ల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, అధిక లాభాలకు ఆశపడి వ్యాపారులు దొడ్డిదారిన ఈ మృత్యు దారాలను నగరానికి తరలిస్తున్నట్లు ఈ దాడుల్లో వెల్లడైంది. స్థానికంగా తయారీ లేకపోవడం తో వ్యాపారులు ఢిల్లీ, సూరత్ గుజరాత్, మహారాష్ర్టలోని భీవండి వంటి ప్రాంతాల నుంచి రహస్యంగా బండిళ్లను హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు.
పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు ఈ భారీ మొ త్తాన్ని సీజ్ చేశారు.కాగా సాధారణ నూలు దారంతో పోలిస్తే చైనా మాంజా నైలాన సింథటిక్ చాలా గట్టిగా ఉంటుంది. దీనికి గాజు పొడి, ఇతర రసాయనాలు పూయడం వల్ల ఇది తెగదు. పతంగులు ఎగురవేసేటప్పుడు ఈ దారాలు తెగిపోయి విద్యుత్ తీగలపై, చెట్లపై, రోడ్లపై వేలాడుతూ ఉంటా యి. ప్రధానంగా ఫ్లుఓవర్లు, ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనదారులు వెళ్తున్నప్పు డు ఈ దారాలు కంటికి కనిపించకుండా మెడకు చుట్టుకుంటున్నాయి. దారం బలంగా ఉండటంతో మెడ కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం కావడం, కొన్నిసార్లు ప్రాణా లు పోవడం వంటి విషాదకర ఘటనలు నగరంలో తరచుగా జరుగుతున్నాయి. అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులు ఈ దారాల్లో చిక్కుకుని మరణిస్తున్నాయి.
కఠిన చర్యలు తప్పవు
చైనా మాంజా అమ్మినా, నిల్వ ఉంచినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అటవీ చట్టం వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చైనా మాంజా కొనివ్వొద్దని, సంప్రదాయ నూలు దారాలనే వాడేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.