calender_icon.png 11 January, 2026 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి–సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

10-01-2026 03:13:17 PM

ప్రభుత్వ  విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి 1, 2 వార్డుల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రూ. 23 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని తెలిపారు. శాత్రాజు పల్లిలో రూ. 1 కోటి, 43 లక్షలతో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పూర్తయితే పరిసర గ్రామాలకు శత్రాజ్పల్లి వైద్య కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.

ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన కూడలిలో రూ. 15 లక్షలతో జంక్షన్ సుందరీకరణ కొనసాగుతోందని, 45 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అడుగు స్థలం లేని 11 మందికి బస్ డిపో సమీపంలో ఇళ్లు కేటాయించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 1, 2 వార్డులకు రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించామని వెల్లడించారు. వేములవాడ పట్టణంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.

రాజన్న ఆలయ అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే వాస్తవ రూపం దాల్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.150 కోట్లతో ఆలయాభివృద్ధి జరుగుతోందన్నారు. పట్టణంలో అడుగు జాగా లేని సుమారు 2000 మందికి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రూ.10 కోట్లతో మురుగు నీరు గుడి చేరవు, మూలవాగులో కలవకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, 6 కిలోల సన్నం బియ్యం వంటి హామీలు అమలు అవుతున్నాయని చెప్పారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను విప్ పరిశీలించి, పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.