30-10-2025 01:16:05 AM
పాఠశాల తనిఖీలో కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
ఆదిలాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి) : ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ గ్రామంలో పీఎం-జన్మన్ పథకం ద్వారా మంజూరైన రహదారి పనులను కలెక్టర్ పరిశీలించారు.
పనులు తక్షణమే ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కాంట్రాక్టర్తో పాటు పంచాయతీ రాజ్ విభాగం ఈఈ శివరాం ను ఆదేశించారు. గ్రామీణ రహదారులు పూర్తి అయితే ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తాగునీటి సరఫరా సమస్యపై తెలియజేయగా, కలెక్టర్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భీంపూర్ మండలం లోని గొల్లఘాట్ వరకు 5 కిలోమీటర్ల రహదారి పనికి రూ. 448.00 లక్షలు, అదేవిధంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బుర్కి వరకు 7 కిలోమీటర్ల రహదారి పనికి రూ. 614.00 లక్షలు అంచనా వ్యయంతో పీఎం-జన్మన్ నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యాలయాన్ని సం దర్శించిన కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, శానిటేషన్ కార్యక్రమాలు, ప్రజా సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి సతీష్ సంబంధిత వివరాలను తెలిపారు. అదే విధంగా గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచిస్తూ, విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. భోజన స్టాక్, విద్యార్థుల హాజరును పరిశీలించారు.
గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రయోజనం ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ నలంద ప్రియ, ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.