30-10-2025 01:16:35 AM
జలదిగ్బంధంలో వరంగల్ నగరం
డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై వర్షపు నీరు
నిలిచిన రైళ్ల రాకపోలు
పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు
ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్
విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 29: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షాలు కురిశాయి. వాగులు, చెరువులు, కుంటలు ఉప్పొంగడంతో ప్రధాన రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో మారుమూల పల్లెలన్నీ జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షం కారణంగా పలు గ్రామాల్లో పాత మట్టి మిద్దెలు నేలకూలాయి.
తడిసి ముద్దయిన వరంగల్
భారీ వర్షాలకు వరంగల్ ప్రధా న రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్‌లోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్, బట్టల బజార్లో రోడ్లపైకి వరదనీరు చేరింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు భారీగా నిలిచింది. వరంగల్ బస్టాండ్ చెరువును తలపించింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై వర్షపు నీరు చేరింది. దీంతో సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఇక్కడే నిలిపివేశారు. మహబూబాబాద్‌లో ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతి మడుగులో కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. నెల్లికుదురు మండలం పార్వతమ్మ గూడెం స్టేజి వద్ద రహదారిపై చెట్టు విరిగి పడింది. ఖమ్మం,- మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యాతండా సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో రెండు జిల్లా ల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు. కాజీపేట మార్గంలోనూ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో
శ్రీశైలం ఉత్తరముఖ ద్వారంగా పిలిచే శ్రీ ఉమామహేశ్వర వద్ద పాపనాశనం వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ కొండ చరియలు స్నానపు గదులపై పడడంతో అ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైం ది. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మెట్లు సైతం పగుళ్లు ఏర్పడ్డాయి. కొండపై నుంచి భారీగా నీటి ధార ధారాలంగా పడుతుండటంతో ఆలయ అధికారులు తాత్కాలి కంగా ఆలయాన్ని ఒకరోజు మూసివేశారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో తెలంగాణ, ఏపీకి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా 196.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పునుతల183.2, అచ్చంపేట158.5, చారకొండ133.8, ఊర్కొండ 124.3, తెల్కపల్లి 121.2, బల్మూర్120.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఎస్‌ఏవన్ పరీక్షలను సైతం వాయిదా వేశారు.
చారకొండ మండ లం తుర్కలపల్లి గ్రామంలో పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల, చారకొండ మండలం తుర్కలపల్లి గ్రామంలో మట్టి మిద్దెలు నేల కులాయి. లింగాల మండలం అవసలికుంట అంబటిపల్లి గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు తాడు సహాయంతో కార్లో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా బయటికి తీశారు.
మార్లపాడు కేశవతాండ ముంపుకు గురికావడంతో విషయం తెలుసుకున్న అధికారు లు అక్కడి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. నాగర్ కర్నూల్ మున్సి పాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామ శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న నాగసము ద్రం చెరువు అలుగు ప్రాంతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దుందుభి వాగులో గొర్రెల మంద కొట్టుకుపోయింది. దీంతో సుమారు పదుల సంఖ్యలో 100కు పైగా గొర్రెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం ముంచె త్తింది. జడ్చర్లలో ఇండ్ల మధ్యలో మురుగునీరు నిలిచిపోయింది. జడ్చర్లలో 30 మంది విద్యార్థులతో బయలుదేరుతున్న బస్సు రోడ్డుకు ఒకవైపు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులను కిందికి దించడంతో ప్రమాదం జరగలేదు. కోయిలకొండ మండలంలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది.
ఖమ్మం జిల్లాలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాఠశాలలకు సెలవును ప్రకటించారు. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలడంతో ఇల్లందు ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం నుంచి మారేడుమిల్లి మీదుగా విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే మార్గాన్ని అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
జిల్లాలోని ఉపరితల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దు మండలమైన జూలూరుపాడు మండలంలో తుమ్మల వాగు పొంగి ప్రవహించడంతో కాకర్ల బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో చుట్టుపక్క గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బేతాళపాడు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది.
నల్లగొండ జిల్లాలో
మరోవైపు దేవరకొండ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల వరద నీటిలో పూర్తిగా మునిగి విద్యార్థులు చిక్కుకుపోవడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన విద్యార్థులను రక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు వరధ నీటి ధాటికి ధ్వంసమ య్యాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) తానంచర్ల నుంచి మద్దిరాల వరకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చందుపట్ల చివరన చెట్టు కూలి మీదపడి మృతిచెందాడు.
మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామంలో బొమ్మకంటి ఆదెమ్మ నివసించే గుడిసె కూలిపోయింది. నూతనకల్ మండలంలోని తాళ్లసింగారంలోని కాటమయ్య గుడి నుండి పాతర్లపాడు వెళ్లే రోడ్డుపై నీటి ఉద్ధృతి ప్రమాదకరంగా పెరగడంతో రాకపోకలను నిలిపి వేశారు. మోతె మండలంలోని నర్సింహపురం, విభళాపురం గ్రామాల వద్ద పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో వర్షాలకు మూసి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. ఇన్ ఫ్లో 2677.06 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో 7 గేట్ల ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డి రేపాక గ్రామం వరద లో చిక్కుకుపోయింది.
ఇండ్లలోకి నీరు చేరుకోవడంతో పోలీసులు గ్రామానికి చేరుకొని వరద నీటి ఇళ్లలో ఉన్న బాధితులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. గ్రామానికి సమీపంలో ఉన్న పోతిరెడ్డి కుంట భారీ వర్షానికి ఉప్పొంగడంతో ఇళ్లలోకి నీరు రావడంతోపాటు గోవిందాపురం, వెల్దేవి, మా నాయకుంట, కాజీపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కరీంనగర్ జిల్లాలో
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని బోర్నపల్లి వద్ద అత్యధికంగా 23.65 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. హుజూరాబాద్ తోపాటు బోర్నపల్లి ప్రాం తంలో భారీ వర్షం కురియడంతో కరీంనగర్ నుండి వరంగల్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ రహదారిపై జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నందున వర్షానికి నీరు నిలవడంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోగా భారీ వాహనాలు హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ కు మళ్లించారు.
రంగారెడ్డి జిల్లాలో
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం 11 సెంటీమీటర్లు నమోదు కాగా చేవెళ్ల, షాద్‌గర్, ఆమనగల్ బ్లాక్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు, తలకొండపల్లి, బాలాపూర్ సరూర్నగర్, కడ్తాల, కేశంపేట మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొందుర్గు మండలంలోని నవాబుపేట వెళ్లే వెంకర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఫరూక్నగర్ మండలంలోని అయ్యవారిపల్లి వాగు పారుతున్నది.
గత దశాబ్దాలుగా నిండని వెల్జాలు సహదేవమ్మ చెరువు పలుగు పారుతున్నది. రాంపూర్ మండుకుంట చీపునుం తల అమరాయి, సూర్యరావు చెరువు లు నిండాయి. మాడ్గుల మండలంలో శుద్ధ పెళ్లి వాగుపారాడంతో దాదాపు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కలకొండ, ఇర్విన్ పలు గ్రామాల్లో కుంటలు నిండాయి.
వరద మాటున కాలుష్యపు పరుగు
రెండు రోజులుగా కురుస్తున్న వ్యర్షాలకు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో రసాయన వ్యర్ధాలు ఏరులై పారుతున్నాయి. రసాయన వ్యర్ధాలు వర్షం వరదలో కలిసి ఔట్ లెట్‌ల ద్వారా బయటకు వస్తున్నాయి.
మున్నేరులో పెరుగుతున్న ఉధృతి!
పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలు..
ఖమ్మం పట్టణ శివారు నుంచి మున్నేరు ప్రవహిస్తుంది. మొంథా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యా ప్తంగానే కాకుండా, ఎగువను కూ డా భారీగానే వర్షాలు కురుస్తున్నా యి. బుధవారం ఉదయం సాధారణంగానే ఉన్న మున్నేరు ప్రవాహం సాయంత్రానికి 18.5 అడుగుల మేర పెరిగింది. రాత్రికి మరో ౨ అడుగులు పెరిగే ప్రమాదం ఉంద ని తెలుస్తోంది. తుపాను ప్రభావం ఇంకా రెండు రోజులు ఉండటంతో ఎగువన మళ్లీ వర్షాలు కురిస్తే మున్నేరు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న జిల్లా ఉన్నతాధికారులు మున్నేరు వరద పరిస్థితిని అంచనా వేసి వెంటనే అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల కాలనీల్లో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. స్థానిక నయా బజార్ పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ముంపు ప్రాంతాల ప్రజలందరిని ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలతో ఈ ప్రాంత ప్రజలు మూటముల్లె సర్దుకొని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు.