08-08-2025 07:00:02 PM
సిపిఎం..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): వేలాది ఇసుక లారీల వల్ల లేస్తున్న దుమ్ము ధూళి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వెంకటాపురం తాహసీల్దార్ కు సిపిఎం బృందం గురువారం మెమోరాండం అందజేసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ, వెంకటాపురం మండలంలో ప్రస్తుతం నడుస్తున్న ఏడు ఇసుక ర్యాంపులతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇసుక ర్యాంపులకు సంబంధించిన లారీలు కూడా మండల కేంద్రం మీదుగా రవాణా జరుగుతుందని, దీంతో వేలాది ఇసుక లారీలు లేపుతున్న దుమ్ము ధూళితో ప్రధానంగా కూరగాయలు, తిను బండారాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లోకి దుమ్ము వచ్చి చేరుతుందని దీంతో వస్తువులు ఖరాబ్ అవుతున్నాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
నిత్యం మండల కేంద్రంలో వేలాది మంది ప్రజలు తమ అవసరాల కోసం వ్యాపార నిమిత్తం వస్తుంటారని, లారీలు లేపుతున్న దుమ్ము ధూళి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, ఇతర అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, వ్యాపారస్తుల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించారు, మండల కేంద్రంలో దుమ్ము లేవకుండా దుమ్ము నియంత్రణ మిషన్ ద్వారా దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలంలో ఇసుక ర్యాంపుల వద్ద ఇసుక లారీలకు పార్కింగ్ స్థలాలను కేటాయించుకోవాలని తద్వారా ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చని సూచించారు. ప్రతిరోజు ఇసుక ర్యాంపుల లో 80 లారీలకు లోడింగ్ పరిమితి ఇచ్చేలా ఉన్నత అధికారులు కృషి చేయాలని మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చిట్టెం ఆదినారాయణ, గుండమల్ల ప్రసాద్, ఇరుప శీను, కోగిల మాణిక్యం, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.