calender_icon.png 8 August, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల వినియోగం, ర్యాగింగ్ ప్రమాదకరం

08-08-2025 07:02:57 PM

ఆంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెoడెంట్ ఆఫ్ పోలీస్ పి. సీతారామ్..

ఘట్కేసర్: మత్తు పదార్థాల వినియోగం, ర్యాగింగ్ ప్రమాదకరమైనవని వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఆంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. సీతారామ్(Anti Narcotics Bureau Superintendent of Police Sitaram) అన్నారు. విద్యార్థులకు సురక్షితమైన, మత్తుకు దూరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు అనురాగ్ యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంను శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 4000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది మత్తుపదార్థాల వినియోగం, ర్యాగింగ్ యొక్క ప్రమాదాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు శాఖ అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. సీతారామ్ హాజరై డ్రగ్స్, ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలు, అలాగే చట్టపరమైన పరిణామాలను గురించి విద్యార్థులకు చక్కటి సందేశాన్ని అందించారు.

విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం మరియు ర్యాగింగ్ వల్ల వచ్చే తీవ్రమైన పరిణామాలపై అవగాహన అవసరమని వివరించారు. సంస్థలో లేదా సంస్థ వెలుపల ఇటువంటి చర్యలలో నేరుగా లేదా పరోక్షంగా పాల్గొన్నవారికి శిక్ష, జైలుశిక్ష మరియు ఆర్థిక జరిమానాలు విధించబడతాయని వారు స్పష్టంగా తెలియజేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సైదులు, పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ బి. రాజు, అలాగే ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ ఎం. శివకృష్ణ, డీన్ లు డాక్టర్ వి. శ్రీనివాస్ రావు, డాక్టర్ వి. విజయ్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు,  ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్  సి. మల్లేశ, ఎన్ఎస్ఎస్, ఎన్ సీ సీ ట్రైనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన వీడియోలు ప్రదర్శించబడ్డాయి. ఈ వీడియోలు డ్రగ్స్ మరియు ర్యాగింగ్ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రతికూల ప్రభావాలను చక్కగా వివరించాయి. మరియు విద్యార్థులలో ఆత్మవిమర్శ కలిగించాయి. బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.