26-07-2025 12:59:56 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు మల్లంపల్లి,జూలై25(విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ శుక్రవారం రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు,డెంగ్యూ,మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకొని, వర్షాకాలంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కు వచ్చే జ్వర పిడుతులకు ఏ ఏ పరీక్షలు చేస్తున్నారని, మందుల నిల్వలు సరిపడే విధంగా ఉన్నాయ అని, వివరాలు అడుగగా, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్. శ్రవణ్ కుమార్ జ్వరంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు చేస్తున్నామని, దానితోపాటు దోమల నియంత్రణ చర్యలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని, పెద్దవారికి టాబ్లెట్స్, చిన్నపిల్లలకు పౌడర్ రూపంలో ఉన్న మందులను చికిత్సగా ఇస్తున్నామని తెలిపారు.
అనంతరం ఆయుష్ సెంటర్ను సందర్శించి ఎటువంటి సమస్యలతో ఆయుష్ సెంటర్కు ప్రజలు వస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకోగా, చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, అనోరెక్టల్, సాధారణ జబ్బులతో ఎక్కువ వస్తున్నారని వారికి చికిత్సలు జేస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఫీవర్ సర్వే చేయాలని ప్రతిరోజు 20 ఇంటింటి సందర్శన భావించాలని దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
అంగన్‌వాడీలో ఆటపాటలతో విద్యను బోధించాలి
ములుగు, జూలై25(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో నూతన సిలబస్ ప్రకారం ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను బోధించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.శుక్రవారం ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లోని మల్లంపల్లి అంగన్ వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడిలో తల్లులతో మాట్లాడారు. పిల్లలు ఇక్కడే భోజనం చేస్తున్నారా లేదా ఆరా తీశారు. సామ్ పిల్లలు,మ్యామ్ పిల్లల గ్రోత్ ఎలా ఉందని,ఏ ఫుడ్ ఇస్తున్నారు,బాలమృతం ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
పిల్లలను ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రానికి పంపాలని సూచించారు. కిచెన్ షేడ్ ను, స్వయంగా తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను బోధించాలని, వారితో మమేకమై గేయాలు పాడించలన్నారు. అన్ని అంగన్వాడి కేంద్రాలలో నెలవారి సిలబస్ ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు.
గర్భిణీలు, బాలింతలకు మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం వేడివేడిగా ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా పిల్లల బరువు, ఎత్తు తూచాలని, బరువు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ బరువు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అతిగా బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయాలని ఆదేశించారు.