calender_icon.png 27 July, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 205 కోట్లు

26-07-2025 01:00:39 AM

భూసేకరణకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో భాగంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం గతంలో మూసివేతకు గురైన విషయం తెలిసిందే.

దాని పునరుద్ధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ విమానాశ్రయ పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అదనంగా 253 ఎకరాలు అవసరమని మార్చి నెలలో గుర్తించింది. ఈ భూసేకరణ ప్రక్రియలో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన భూములను గుర్తించారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జీఎంఆర్ సంస్థ విధించిన 150 కి.మీ దూరం నిబంధనను కూడా సడలించడంతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగాయి.

ఈ విమానాశ్రయం ఏ రకం విమానాల కోసం ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లుటై రూల్స్ (ఐఎఫ్‌ఆర్) సామర్థ్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషనల్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టాలేషన్ వంటి నిర్మాణాలు ఇక్కడ చేపట్టనున్నారు. భూసేకరణకు నిధుల కేటాయింపుతో ఇక విమానాశ్రయం పనులు వేగంగా సాగుతాయని భావిస్తున్నారు.