calender_icon.png 27 July, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి

26-07-2025 10:32:37 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. శనివారం ఇటిక్యాల మండలంలోని కొండేర్ గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ బి.యం.సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టలని తెలిపారు. ఆశ వర్కర్ల దగ్గర అన్ని రకాల మందులు జ్వరం, దగ్గు సీజనల్ వ్యాధులకు సంబంధించిన అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు గ్రామాల్లో నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు పెరగకుండా కిరోసిన్ చల్లడం, దోమల మందు కొట్టడం, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యశాఖ అధికారులు స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గతంలో అధిక కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, గర్భిణులను వెంటనే సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించాలని అన్నారు. ప్రజలు కాచిన వేడి నీటిని తాగాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

అనంతరం కలెక్టర్ కొండేర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామానికి మంజూరైన 32 ఇండ్లలో 22 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణంలో ఉండగా, మిగిలిన 10 ఇండ్లు మార్కింగ్ దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కి వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్,ఇండ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతంగా జరగాలని ఆదేశించారు. లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలు ప్రజలకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, జిల్లా వైద్య అధికారి సిద్దప్ప,డాక్టర్ రాధిక, హౌసింగ్ డి.ఈ శ్రీనివాసులు, పంచాయితీ సెక్రటరీ, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.