05-10-2025 05:22:31 PM
నకిరేకల్ (విజయక్రాంతి): 65వ నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు భారీ ట్రాఫిక్ దృశ్య నియంత్రణకు కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దసరా పండుగ ముగియడంతో స్వస్థలాలకు వెళ్ళిన వారు తిరిగి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవ్వడంతో గత రెండు రోజులుగా హైవేపై హైదరాబాదు వైపు వాహనాల రద్దీ అధికమైంది. భారీ సంఖ్యలో కార్లు, బస్సులు బారులు తీరి కనిపిస్తున్నాయి.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టంగూరు మండల పరిధిలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఉత్పన్నం కాకుండా ఎస్సై రవీందర్ మండల పరిధిలోని పలు గ్రామాల వద్ద హైవేపై పోలీస్ సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకుగాను ఆదివారం కట్టంగూరు మండల కేంద్రంలోని నల్గొండ క్రాస్ రోడ్డు, ముత్యాలమ్మ గూడెం, ఐటి పాముల గ్రామాల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నచోట్ల ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సిబ్బందిని నియమించి చర్యలు తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.