16 April, 2026 | 1:41 AM

చౌరస్తాల సుందరీకరణకు మోక్షమెప్పుడో..?

16-04-2026 12:00 AM

అలంకార ప్రాయంగా మెదక్ చౌరస్తాలు..!

రెండేళ్లు గడిచినా అతీ గతి లేదు..

హామీలు నీటి మూటలేనా..

మెదక్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది మెదక్ పరిస్థితి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాస్త మెరుగు పడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు.

చౌరస్తాల సుందరీకరణకు మోక్షం ఎప్పుడో...? 

జిల్లా కేంద్రం మెదక్ లో చౌరస్తాలు సుందరీకరణ పనులకు మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత వ్యాపార, వాణిజ్య సంస్థలు భారీగానే వెలుస్తున్నాయి. మెదక్ పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారస్తులు, ఆయా మండలాల నుంచి పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. 

మెదక్ జిల్లా కేంద్రానికి మెదక్, నర్సాపూర్, ఎల్లా రెడ్డి, రామా యం పేట ప్రాంతాలకు వెళ్ళే రోడ్డు లో చౌరస్తాలు ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో మధ్యలో రాందాస్ చౌరస్తా, మెదక్..చేగుంట రోడ్డు లో వెల్కమ్ బోర్డు చౌరస్తా,  మెదక్... బోధన్ చౌరస్తాలో  ధ్యాన్ చంద్ చౌరస్తాలు ఉన్నాయి.  ఈ చౌరస్తాలో ఉన్న విగ్రహాలను తొలగించారు. రాందాస్ చౌరస్తాలో శివాజీ, గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 

ఫ్లెక్సీలకు అడ్డాలుగా చౌరస్తాలు... 

ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫ్లెక్సీల ఏర్పాటుకు, ప్రైవేట్ వ్యక్తుల ప్రచార బోర్డులకు అడ్డులుగా మారుతున్నాయి. అంతే కాకుండా మెదక్ జిల్లా కేంద్రం అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు చేసిన పాపాన పోలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ పట్టణంలోని కోర్టు ఎదురుగా సమీకృత మార్కెట్ భవన నిర్మాణం అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది.  పట్టణ శివారులో నిర్మిస్తున్న వైకుంఠ ధామం మధ్యలోనే ఆగిపోయింది. ఇలా జిల్లా కేంద్రంలో ఏ వార్డులో కూడా పెద్దగా అభివృద్ధి పనులకు నోచుకోలేదని ఆయా వార్డుల ప్రజలు అంటున్నారు.

హామీలు నీటి మూటలేనా..? 

గత రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైనంపల్లి రోహిత్ రావు తనను గెలిపిస్తే మెదక్ జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, మెదక్ పట్టణంలోని చౌరస్తాలను సుందరీకరణగా మారుస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు మెదక్ అభివృద్ధినీ రాందాస్ చౌరస్తా నుంచే ప్రారంభిస్తామని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని బ్లూ ప్రింట్ చిత్రాలను కూడా చూపించారు. కానీ ఇప్పటి వరకూ చౌరస్తాల సుందరీకరణ వైపు అడుగు పడలేదు. ఇప్పటికైనా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టి సారించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.