17-12-2025 12:00:00 AM
మండల వైద్యాధికారి డాక్టర్ లిఖిత్
నూతనకల్, డిసెంబర్ 16:కుష్టు వ్యాధి రహిత సమాజం కోసం వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలని నూతనకల్ మండల వైద్యాధికారి డాక్టర్ లిఖిత్ పిలుపునిచ్చారు.మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ లిఖిత్ మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో కుష్టు వ్యాధి నిర్ధారణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సమయంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారన్నారు. ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరినీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. శరీరంపై మచ్చలు లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం తీసుకుంటే కుష్టు వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలిపారు.ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ చరణ్ నాయక్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.