17-12-2025 12:00:00 AM
హుజూర్ నగర్ , డిసెంబర్ 16 : నియోజకవర్గంలోని మఠంపల్లి మండల పరిధిలోగల బక్కమంతులగూడెంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఇరిగెల నరేందర్ రెడ్డి వార్డ్ సభ్యులు కృష్ణపాటి నవీన్ రెడ్డి,పల్లె నరసింహా రెడ్డి, పారెడ్డి సైదిరెడ్డి, బల్మూరి వీరారెడ్డి, మాదారపు గోపీలను సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఏ కారణం లేకుండా పోలీసులు మఠంపల్లి స్టేషన్ తీసుకువెళ్లి అక్కడ విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆరోపించారన్నారు.
అలాగే వారి సెల్ ఫోన్లు లాక్కొని ఉదయం వదలి పెట్టారని కారణం లేకుండా తమపై దాడి చేశారని చెప్పడంతో పలువురు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సారి గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఈసారి ఇలా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కొట్టడంలో ఆంతర్యం ఏమిటో అనేది అర్ధం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న అధికార పార్టీ కి చెందిన వారి ప్రోద్బలంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. దీని కారణంగా గ్రామంలో పరిస్థితి ఉధృతంగా మారడంతో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.