వైద్య విద్యార్థి ఆత్మహత్య
మానసిక ఒత్తిడే కారణం?
ఆదిలాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కాలేజీలో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెం దిన సాహిల్ చౌదరి (22) ఎంబీబీఎస్ ద్వితీ య సంవత్సరం చదువుతున్నాడు. బుధవా రం తన హస్టల్ గదిలోనే బుధవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆగస్టు 2నుంచి పరీక్షలు ఉండటంతోనే పరీక్షల భయంతోనే మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యార్థి మృతి ఘటనపై ఓ కమిటీని వేసి విచారణ చేపట్టనున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. సాహిల్ చౌదరి చాలా క్లెవర్ స్టూడెంట్ అని, మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు క్లియర్ చేశాడని తెలిపారు.
ఎలాంటి అనారోగ్య సమస్యలుగానీ, ప్రేమ వ్యవహారం లేవని తోటి విద్యార్థులు చెపుతున్నారు. టూ టౌన్ సీఐ కరుణాకర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి వచ్చి విద్యార్థి మృతదేహాన్ని, విద్యార్థి ఉంటున్న గదిని పరిశీలించారు.
అనంతరం తోటి విద్యార్థులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని రాజస్థాన్‌కు పంపే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతుందన్నారు. అదేవిధంగా వసతి గృహంలో నెలకొన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.






