06-07-2025 01:24:37 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): వైద్య వృత్తి వ్యాపారం కాదని, అదొక పవిత్రమైన సేవ అని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. వైద్యులు తమ నైపుణ్యా న్ని పేదల ప్రయోజనం కోసం స్వచ్ఛందంగా విస్తరించాలని పిలుపునిచ్చారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసై టీ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో ‘ఎక్సలెన్స్ అవార్డ్స్-2025’ ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజా ఆరోగ్య రంగంలో విశేష సేవ లు అందించిన వైద్యులను సన్మానించి, అవార్డులు అందజేశారు. భారతరత్న డాక్టర్ బీసీ రాయ్‌కు నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. వైద్యులందరూ వారానికి కనీసం ఒక రోజు స్వచ్ఛంద సేవకు అంకితం కావాలని, టీబీ ముక్త్ భారత్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న ఆరోగ్య సేవలను గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మాసబ్ ట్యాంక్‌లో కొత్త బ్లడ్ సెంటర్ స్థాపన, జనరిక్ ఔషధ దుకాణాల ఏర్పాటును అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, రాజ్‌భవన్ అధికారులు, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.