ఆక్స్ఫర్డ్ పాఠశాలలో కిడ్స్ మార్కెట్ ప్రారంభించిన ఎంఈఓ నాగేశ్వరరావు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంగళ వారం రోజు చిన్నారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కిడ్స్ మార్కెట్ అత్యంత విజయవంతంగా జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, ఆత్మవిశ్వాసం మరియు బాధ్యతాభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలను కూడా నేర్పాలి. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమన్వయ భావన మరియు ఆర్థిక అవగాహన పెంచుతాయి” అని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యాన్ని మరియు ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య నరేష్ గారు మాట్లాడుతూ, పిల్లల సమగ్రాభివృద్ధి కోసం విద్యతో పాటు ప్రాయోగిక అనుభవాలు కూడా అవసరమని తెలిపారు.
తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లల స్టాల్స్ వద్ద వస్తువులు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పద్మ, తేజస్వి, రేఖ, సౌభాగ్య, వీణ, సునీత, మౌనిక, మనీషా, సవిత, మానస తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చిన్నారులు స్వయంగా స్టాల్స్ ఏర్పాటు చేసి, వివిధ హస్తకళలు, ఆహార పదార్థాలు మరియు సృజనాత్మక వస్తువులను ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించారు.
పిల్లలు కస్టమర్లతో మాట్లాడడం, ధర నిర్ణయించడం, లావాదేవీలు నిర్వహించడం వంటి అంశాల్లో చురుకుదనం ప్రదర్శించారు. ఇది వారికి భవిష్యత్తులో వ్యాపార దృక్పథం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదపడుతుంది. కార్యక్రమం మొత్తం ఆనందభరిత వాతావరణంలో సాగి, తల్లిదండ్రులు, అతిథుల ప్రశంసలు అందుకుంది. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది వేస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. మాజీ కౌన్సిలర్ నందకిశోర్, మాజీ ఎంపీటీసీ సాగర్ షిండే, పంతులు రాము, యండమూరి వర ప్రసాద్, ప్రచేతన్ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




